హస్తం చేతిలో ఎర్రపార్టీలు

April 23, 2018


img

హైదరాబాద్ లో 5 రోజులపాటు జరిగిన సిపిఎం 22వ మహాసభల ముగింపు సందర్భంగా సరూర్ నగర్ మైదానంలో జరిగిన బహిరంగసభలో ఒకే వేదికపై నుంచి ఆ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం విశేషం. తెలంగాణాలో సుదీర్గ పాదయాత్రలు చేసి, తెరాస సర్కార్ పై నిరంతర పోరాటాలు చేస్తూ, వచ్చే ఎన్నికలలో సిపిఎం నేతృత్వంలో ఏర్పాటు చేసిన బిఎల్ఎఫ్ ను గెలిపించుకోవడానికి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కృషి చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్రమంతటా ఎర్రజెండాలు రెపరెపలాడాలని, రాష్ట్రంలో ఎర్రసామ్రాజ్యం ఏర్పడాలని అయన చెపుతుంటే, కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ధర్డ్ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ విధివిధానాలను ప్రకటించాక దానిలో చేరాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకొంటామని జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది.

ఇక మోడీ సర్కార్ ను తిట్టదానికే సిపిఎం మహాసభలు నిర్వహించిందన్న భాజపా నేతలను నిజమని నిరూపిస్తున్నట్లు సాగాయి పార్టీ నేతల ప్రసంగాలు. భాజపాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా చెప్పిన సిపిఎం నేతలు, కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు ఇంకా ఆరాటపడుతూనే ఉన్నారని చెప్పకనే చెప్పింది వారి తీర్మానం. కాంగ్రెస్ పార్టీతో అవగాహన ఉంటుంది కానీ ఎటువంటి ఒప్పందమూ లేదని, ఆ పార్టీతో పొత్తుల గురించి ఎన్నికల సమయంలోనే ఆలోచించి నిర్ణయం తీసుకొంటామని సీతారాం ఏచూరి చెప్పడం గమనిస్తే, దేశమంతా ఎర్రజెండాలు ఎగరాలని సిపిఎం ఎర్రటి పగటికలలు కంటుంది కానీ అది కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని కొన్ని సీట్లు సాధించుకోవడంతోనే సరిపెట్టుకొంటుందని స్పష్టమవుతోంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్ర స్థాయిలో రోజూ తను విమర్శిస్తున్న తెరాసతో పొత్తులు పెట్టుకోవడానికి అర్రులు చాస్తున్నప్పుడు ఈ హడావుడి, ప్రగల్భాలు ఎందుకో? 


Related Post