వాళ్ళను ఆ రాములోరే శిక్షిస్తారు: హరీష్ రావు

April 20, 2018


img

కాంగ్రెస్ ప్రజాచైతన్య యాత్ర సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “కెసిఆర్ పాలన రైతులకు శాపం. తెరాస సర్కార్ భద్రాద్రి పట్టణాన్ని పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు..” అంటూ చాలా విమర్శలు గుప్పించారు. అయన విమర్శలకు మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. 

సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ, “పవిత్రమైన రాములోరి సన్నిధిలో నిలబడి అబద్దాలు ఆడుతున్న కాంగ్రెస్ నేతలను ఆ రాములోరే శిక్షిస్తారు. పోలవరం ప్రాజెక్టు వలన భద్రాచలం, ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ముంపుకు గురవుతాయని తెలిసి ఉన్నప్పటికీ, దానిని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణా ఏర్పడుతున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఆంధ్రాకు బదిలీ చేస్తుంటే నోరు మెదపని కాంగ్రెస్ నేతలు భద్రాచలం గురించి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయంలో వచ్చిన నీలం తుఫాను ధాటికి తూర్పు గోదావరి, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో పంటలు దెబ్బతింటే మేము ఎంత మొత్తుకొన్నా ఖమ్మం, వరంగల్ జిల్లాల రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదనే సంగతి కాంగ్రెస్ నేతలకు గుర్తులేదా? అప్పుడు మంత్రులుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణా రైతులకు జరిగిన అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయారు? 

ఇప్పుడు మా ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాల రైతులకు మేలు చేసే అనేక పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తుంటే మాపై విమర్శలు గుప్పిస్తారా? తమ హయంలో ఎన్నడూ భద్రాద్రి పట్టణం, ఆలయం అభివృద్ధిని పట్టించుకొని కాంగ్రెస్ నేతలా మాపై విమర్శలు చేసేది? గోబెల్స్ ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్దాంతమైతే, సత్యమేవ జయతే మా పార్టీ సిద్దాంతం. కాంగ్రెస్ పాలనకు, మా ప్రభుత్వ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్ళు కృషి చేస్తున్న మా ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధి చెపుతారు,” అని మంత్రి హరీష్ రావు అన్నారు.


Related Post