మా పదవులూడితే కొందరు పండగ చేసుకొన్నారు: సంపత్ కుమార్

April 19, 2018


img

కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బుధవారం అమరవాయిలో విలేఖరులతో మాట్లాడుతూ, “హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటిది. తెరాస నేతలు నన్ను ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకోవాలనుకొన్నారు. కానీ నేను అంగీకరించలేదు. 2014 ఎన్నికలలో ఆలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలుచేయాలని పట్టుబడుతుండంతో నాపై కక్షకట్టి నా శాసనసభ్యత్వం రద్దు చేశారు. కానీ తెరాస ఒకటనుకొంటే జరిగింది మరొకటి. హైకోర్టు తీర్పు తెరాస సర్కార్ ఒక గుణపాఠంవంటిది. ఇకనైనా ప్రజాస్వామ్యపద్దతిలో నడుచుకొంటే మంచిది. నా సభ్యత్వం రద్దు చేయగానే కొందరు ఉపఎన్నికలు వచ్చేస్తాయని సంబరపడ్డారు. అది వారి దివాలాకోరుతనానికి నిదర్శనం. ఒకవేళ ఉపఎన్నికలు వచ్చినా ఆలంపూర్ లో కాంగ్రెస్ పార్టీని తెరాస ఎన్నటికీ ఓడించలేదని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.       

ఈకేసులో హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష వంటిదే కనుక దానిని అందరూ స్వాగతించవలసిందే. కానీ తెరాస పంతానికిపోయి దీనిపై సుప్రీంకోర్టుకు వెళితే అక్కడేమి జరుగుతుందో తరువాత ఆలోచించవచ్చు. సంపత్ కుమార్ ఆరోపిస్తున్నట్లుగా వారి శాసనసభ్యత్వం రద్దుకాగానే ఉపఎన్నికలు వచ్చేస్తున్నాయని తెరాసలో కొందరు సంబరపడటం సహజమే. బహుశః కాంగ్రెస్ పార్టీలో కూడా లోలోన చాలా సంతోషపడినవారుండవచ్చు. ఒకవేళ నిజంగా ఉపఎన్నికలు వచ్చి ఉండి ఉంటే, కాంగ్రెస్ తెరాసల బలాబలాలు ఏపాటివో అందరికీ అర్ధం అయ్యుండేది. అలాగే కాంగ్రెస్ నేతల ఐక్యత ఏపాటిదో అందరికీ తెలిసివచ్చేది. కానీ తృటిలో ఉపఎన్నికలు తప్పిపోయాయి. కనుక మళ్ళీ ఎన్నికలు వచ్చేదాక కాంగ్రెస్, తెరాసలు తమ బలాబలాల గురించి ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు.   



Related Post