కోమటిరెడ్డి చెపుతున్నది నిజమేనా?

April 19, 2018


img

కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొన్ని నెలలుగా పదేపదే తెరాసనేతలపై ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే వేముల వీరేశం కలిసి తమ అనుచరులతో తనను హత్య చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. కానీ అటు తెరాస, ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ నేతలు గానీ ఆ ఆరోపణలపై స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే అయన ప్రజలను ఆకట్టుకోవడానికే ఆవిధంగా ఆరోపణలు చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెల్లీ ఇవ్వాళ్ళ కూడా అవే ఆరోపణలు చేశారు. అయితే వెయ్యి మంది కెసిఆర్ లు వచ్చినా ఎవరూ తనను ఏమీ చేయలేరని త్వరలోనే తాను తెలంగాణా అంతటా పాదయాత్ర చేసి తెరాస సర్కార్ అవినీతిని ఎండగడతానని అన్నారు. తన పాదయాత్రతోనే తెరాస పతనం ప్రారంభం అవుతుందని హెచ్చరించారు.              

ఒకవేళ నిజంగానే తనపై హత్య ప్రయత్నం జరుగుతున్నట్లు ఆయనకు అనుమానం ఉన్నట్లయితే ముందుగా పోలీస్ శాఖకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసి తనకు రక్షణ కల్పించమని కోరడం చాలా అవసరం. ఎందుకంటే అయన శాసనసభ్యత్వం రద్దుచేయగానే ప్రభుత్వం అయన గన్ మ్యాన్లను వెనక్కు తీసుకొంది. ఒకవేళ ప్రభుత్వం ఏ కారణం చేతైనా మళ్ళీ గన్ మ్యాన్లను ఏర్పాటు చేయకపోతే తన జాగ్రత్తలు తాను ఉండాలి. కానీ వెయ్యి మంది కెసిఆర్ లు వచ్చినా ఎవరూ తనను ఏమీ చేయలేరని త్వరలోనే పాదయాత్ర చేస్తానని చెప్పుకొంటున్నారు. కనుక ఆయన చేస్తున్న ఆరోపణలు నమ్మశక్యంగా కనిపించడంలేదు. బహుశః అందుకే కాంగ్రెస్ నేతలు కూడా అయన ఆరోపణలను సమర్ధిస్తూ మాట్లాడటం లేదేమో?


Related Post