మక్కా బాంబ్ కేసులో అందరూ నిర్దోషులే! మరైతే...

April 16, 2018


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ మక్కా బాంబు ప్రేలుళ్ళ కేసులో నిందితులుగా పేర్కొనబడిన ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ నాంపల్లి ఎన్ఐఏ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. వారు దోషులని నిరూపించేందుకు బలమైన సాక్షాధారాలు లేనందున అందరినీ నిర్దోషులుగా ప్రకటించి కేసును కొట్టివేసింది.

ఎన్‌ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన నిందితుల పేర్లు: దేవేందర్ గుప్తా (ఏ-1), లోకేష్ శర్మ(ఏ-2), స్వామి ఆసిమానందా (ఏ-6), భరత్ భాయ్ (ఏ-7), రాజేందర్ చౌదరి (ఏ-8). 

ఆ కేసు వివరాలు క్లుప్తంగా: 

2007 మే 18న మసీదులో ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో ప్రేలుళ్ళు జరిగాయి. వాటిలో తొమ్మిది మంది అక్కడే మరణించగా అనేకమంది గాయపడ్డారు. అనంతరం జరిగిన మతఘర్షణలలో 14మంది చనిపోగా, 58మంది గాయపడ్డారు. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ అనేక వందలమందిని విచారించింది. ఆనేకమందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. వారి నుంచి బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తరువాత మొత్తం 10 మందిపై ఛార్జ్ షీట్స్ దాఖలు చేసింది. దాదాపు 11 సం.ల సుదీర్ఘకాలంపాటు విచారణ సాగింది. చివరికి నిందితులను దోషులని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెపుతూ, ఐదుగురిని నిర్దోషులని పేర్కొంటూ కేసు కొట్టేసింది. మిగిలిన ఐదుగురిలో ఒకరు చనిపోయారు వారు నలుగురిపై విచారణ కొనసాగుతుందని కోర్టు పేర్కొంది. 

దాదాపు 11 ఏళ్ళపాటు సాగిన ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు జరిపి నిందితులుగా పేర్కొన్నవారిని ఎన్ఐఏ కోర్టే నిర్దోషులుగా ప్రకటించడం చూస్తే కొండను త్రవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయిందని అర్ధమవుతోంది. అందరూ నిర్దోషులే అయితే మరి మక్కా మసీదుపై బాంబుదాడి ఎవరు చేసినట్లు? ఎవరిని శిక్షించాలి? 


Related Post