మాది ధర్డ్ ఫ్రంట్ కాదు: కెసిఆర్

March 19, 2018


img

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇవ్వాళ్ళ సాయంత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కోల్‌కతాలో సమావేశమయ్యి ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించారు. అనంతరం వారిరువురూ కలిసి మీడియాతో మాట్లాడారు. 

మమతా బెనర్జీ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటువంటి ప్రతిపాదనతో రావడం చాలా శుభపరిణామం. మేము దేశంలో రైతుల సమస్యలతో సహా అనేక అంశాలపై లోతుగా చర్చించాము. భావసారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతాము. పరిస్థితులే నాయకులను సృష్టిస్తాయి,” అని అన్నారు. 

కెసిఆర్ మాట్లాడుతూ, “దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, భాజపాలే పాలిస్తున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగలేదు. ప్రభుత్వాలు మారుతున్నా వాటి ఆలోచనలు, విధానాలు మారడం లేదు. కనుక కాంగ్రెస్, భాజపాలకు బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి చాలా అవసరం. దేశప్రజలు కూడా మార్పు కోరుకొంటున్నారు. అధికారం చేజ్జికించుకోవడం కోసం ఏవో కొన్ని పార్టీలను కలుపుకొని ఫ్రంట్ ఏర్పాటు చేయడం లేదు. మన రాజకీయ వ్యవస్థలో గుణాత్మకమైన మార్పు సాధించడం కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొంటున్నాము. రాష్ట్రాలు బలంగా ఉన్నప్పుడే దేశం కూడా బలంగా ఉంటుందనే ఆలోచనతోనే ఈ కూటమిని ఏర్పాటు చేయడానికి సిద్దపడుతున్నాము. ఆ దిశలో ఈరోజు తొలిఅడుగు పడింది. 2019 ఎన్నికల నాటికి మా ఫెడరల్ ఫ్రంట్ సిద్దం అవుతుంది,” అని అన్నారు.


Related Post