ఎవరి పంచాంగం వారిదే..కానీ అందరికీ శుభం!

March 19, 2018


img

ఉగాది రోజున గుళ్ళు, గోపురాలలో జరిగే పంచాంగశ్రవణానికి, అధికార ప్రతిపక్ష పార్టీలు ‘చెప్పించుకొనే’ పంచాంగాలకు చాలా తేడా ఉంటుంది. గుళ్ళు, గోపురాలలో ఎవరి ఒత్తిళ్ళు ఉండవు కనుక పంచాగకర్తలు వారికి తెలిసిందే నిఖచ్చిగా చెపుతుంటారు. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీలు ‘చెప్పించుకొనే’ పంచాంగాలు మాత్రం మంచి సినిమాను తలపిస్తుంటాయి. ఆ సినిమాలో ‘హీరో’ సదరు రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ప్రతిపక్ష నేత అయ్యుంటారని వేరే చెప్పనక్కరలేదు. హీరో ఏమి చేసినా...ఎలా చేసినా అంతా కరెక్టే కనుక వేలెత్తి చూపడానికి ఏమీ ఉండదు. నిన్న రెండు తెలుగు రాష్ట్రాలలో వినిపించిన అధికార, ప్రతిపక్షాల పంచాంగాలు కూడా అలాగే సాగాయి. అవి ఆయా నేతల మనసులో ఆలోచనలకు, కోరికలకు అద్దంపట్టాయి. 

“రెండు తెలుగు రాష్ట్రాల ఏలికలు అద్భుతంగా పాలిస్తున్నారు. వారి పాలనలో రాష్ట్రాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి. రెండు రాష్ట్రాలలో చాలా ప్రశాంతమైన రాజకీయ వాతావరణం, శాంతిభద్రతలు నెలకొని ఉన్నాయి. ప్రజలు చాలా సుఖసంతోషాలతో జీవిస్తున్నారు. అధికారంలో ఉన్నవారికే ప్రజాధారణ ఉంది. కనుక వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ వారే విజయం సాధించి అధికారం చేపట్టబోతున్నారు. వారికి సవాలు విసురుతున్న రాజకీయ ప్రత్యర్ధులు వారి చేతుల్లో ఓడిపోతారు” ఇదీ...క్లుప్తంగా అధికార పంచాంగాల సారాంశం. 

ఇక వారి ప్రత్యర్ధ పార్టీలైన కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల పంచాంగాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అది సహజమే. హైదరాబాద్ గాంధీ భవన్ లో చెప్పబడిన ‘కాంగ్రెస్ పంచాంగం’లో, ఏపిలోని శ్రీశైలంలో ‘వైకాపా పంచాంగం’లో అమరావతిలో ‘జనసేన పంచాంగం’లో రెండు రాష్ట్రాలలో ప్రజలలో తీవ్ర అశాంతి నెలకొని ఉందని, కానీ పాలకులు దానిని పట్టించుకోఎన్ పరిస్థితిలో లేనందున, వచ్చే ఎన్నికలలో అధికార మార్పిడి అనివార్యంగా కనబడుతోందని, తెలంగాణాలో కాంగ్రెస్, ఏపిలో వైకాపాలు అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని తేల్చి చెప్పారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కు రాజయోగం పట్టబోతోందని జనసేన పంచాంగం’ స్పష్టం చేసింది.  

ఎవరి పంచాంగం వారిదే అయినప్పటికీ అధికార, ప్రతిపక్షాల నేతలందరికీ పదవీ, అధికారయోగం ఉందని చెప్పి పంచాంగకర్తలు అందరినీ సంతోషపెట్టారు. కానీ అది సాధ్యం కాదని వారికీ తెలుసు. నేతలకూ తెలుసు. ప్రజలకీ తెలుసు. మనుషులు చేదు నిజాలను వినడానికి ఇష్టపడరని, భ్రమలో బ్రతకడానికే ఎక్కువ ఇష్టపడతారని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏమి కావాలి?



Related Post