అన్ని రైళ్ళలో వైఫి..సిసి కెమెరాలు!

March 19, 2018


img

దేశంలో రోజూ వేలాది రైళ్ళు నడుస్తుంటాయి. వాటిలో లక్షలాదిమంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న ఈ రైల్వే వ్యవస్థలో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. నిత్యం వేల కోట్ల వ్యాపారం సాగుతుంది. కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా రైల్వేల ప్రాధాన్యతను ఏ ప్రభుత్వమూ  గుర్తించలేదు. గుర్తించినా పెద్దగా పట్టించుకోలేదు. కనుక భారతీయ రైల్వే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుండిపోయింది. 

మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత భారతీయ రైల్వేకు గ్రీన్ సిగ్నల్ పడింది. అప్పటి నుంచే దేశంలో రైల్వే అభివృద్ధి కాస్త వేగం పుంజుకొంది. ఇంతకుముందు రైల్వేమంత్రిగా వ్యవహరించిన సురేష్ ప్రభు, ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్న పీయూష్ గోయల్ ఇద్దరూ చాలా సమర్ధులు. దేశ అవసరాలు, వనరులను దృష్టిలో పెట్టుకొని వారు ఎప్పటికప్పుడు విన్నూత్నమైన ఆలోచనలను, సంస్కరణలను అమలుచేయడం వలననే అది సాధ్యపడుతోంది. 

తాజాగా రైల్వేమంత్రి పీయూష్ గోయల్ చేసిన ఒక ప్రకటన అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేశంలో అన్ని రైళ్ళలో అంచెలంచెలుగా వైఫీ సౌకర్యాన్ని, సిసి కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు లక్నోలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. (హైదరాబాద్ మెట్రో రైల్లో ఇప్పటికే సిసి కెమెరాలున్నాయి.)

గత అనేక దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రతిపాదన యూపిలోని రాయ్ బరేలీలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. అది ప్రపంచంలోకెల్లా అతిపెద్దదిగా నిలువబోతోందని చెప్పారు. రాయ్ బరేలీలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకున్న సమస్యలన్నీ పరిష్కరించామని కనుక త్వరలోనే దాని నిర్మాణ పనులు మొదలుపెట్టబోతున్నట్లు మంత్రి చెప్పారు. 

దేశంలోకెల్లా అత్యంత ఎక్కువమందికి ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థగా పేరొందిన రైల్వేలో కొత్తగా 90,000 మందిని భర్తీ ప్రక్రియ కూడా మొదలైందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత, ఆధునిక సదుపాయాలు కల్పించగలుగుతున్నామని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. 


Related Post