బిఎల్ఎఫ్ గెలుస్తుందా? ఓట్లు చీలుస్తుందా?

March 19, 2018


img

సిపిఎం నేతృత్వంలో రాష్ట్రంలోని 28 ప్రాంతీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) వచ్చే ఎన్నికలలో 119 స్థానాలకు పోటీ చేస్తుందని ఆ కూటమి నేతలు గట్టిగా చెపుతున్నారు. వారు కేవలం మాటలతోనే సరిపెట్టకుండా అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చురుకుగా చేసుకొంటున్నారు. హైదరాబాద్ లోని ఆర్టిసి క్రాస్ రోడ్స్ వద్ద  ఏర్పాటు చేసుకొన్న బిఎల్ఎఫ్ రాష్ట్ర కార్యాలయాన్ని సోమవారం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. బిఎల్ఎఫ్ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాష్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, గద్దర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.   

బిఎల్ఎఫ్ ప్రకటించినప్పటి నుంచి దాని నేతలు తరచూ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ తమ కూటమి ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా అవసరం కూడా. కానీ వారు ఎంత హడావుడి చేసినప్పటికీ బిఎల్ఎఫ్ లో భాగస్వాములుగా ఉన్న అనామక పార్టీలు, వాటి నేతలు రాజకీయంగా, ఆర్ధికంగా చాలా బలంగా ఉన్న...ప్రజలలో మంచి గుర్తింపు కలిగి ఉన్న తెరాస, కాంగ్రెస్ పార్టీల నేతలను డ్డీకొనగలరా? డ్డీ కొన్నా..గెలవగలరా? అనే సందేహాలు కలగడం సహజం. వారు గెలిచినా గెలవకపోయినా, తెరాస, కాంగ్రెస్ ఓట్లను చీల్చి వాటికి ఎంతో కొంత నష్టం కలిగించవచ్చు. విచిత్రమైన విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయస్థాయి రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తుంటే, అయన అప్రజాస్వామిక, నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో బి.ఎల్.ఎఫ్. కూటమి ఏర్పాటయింది.   


Related Post