ఇక ఏపిలో సమరమే..

March 17, 2018


img

భాజపాతో తెదేపా తెగతెంపులు చేసుకోవడంతో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపి భాజపా నేతలతో శనివారం డిల్లీలో సమావేశమయ్యారు. కేంద్రప్రభుత్వంపై చంద్రబాబుతో సహా తెదేపా నేతలు తీవ్ర విమర్శలు చేస్తునందున ఇక నుంచి తెదేపా సర్కార్ అవినీతిని, అక్రమాలను గట్టిగా ఎండగట్టాలని భాజపా నేతలు నిర్ణయించారు. ఇంతకాలంగా కేంద్రం రాష్ట్రానికి ఎంత సొమ్ము ఇచ్చింది...దానిని తెదేపా సర్కార్ ఏవిధంగా దుర్వినియోగపరిచిందనే విషయం రాష్ట్ర ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. 

పలు ఉత్తరాది రాష్ట్రాలలో భాజపా విజయం సాధించడంలో తెర వెనుక కీలకపాత్ర పోషించిన రామ్ మాధవ్ ను ఏపి రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా నియమించారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు పదవీ కాలం పూర్తయి చాలా కాలమే అయినప్పటికీ, తెదేపా ఒత్తిళ్ళ కారణంగా ఇంతకాలం ఆయననే కొనసాగించవలసి వచ్చింది. ఇప్పుడు తెదేపా ఒత్తిళ్ళు లేవు కనుక ఏపిలో తెదేపాను గట్టిగా డ్డీ కొనగల బలమైన నాయకుడికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. 

ఇక ఈరోజు జరిగిన భాజపా సమావేశంలో కొసమెరుపు ఏమిటంటే, దానిలో వైకాపాకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారని సమాచారం. అంటే, వైకాపాతో భాజపా జతకట్టబోతోందనే తెదేపా అనుమానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇక నుంచి ఏపిలో తెదేపా-భాజపాల మద్య ఒక అసహ్యకరమైన రాజకీయ యుద్ధం మొదలుకాబోతోంది. ఒకవేళ భాజపా-వైకాపాలు జతకడితే ఆ యుద్ధం మరింత అసహ్యకరంగా మారడం ఖాయం. 


Related Post