దానిలో సమన్వయ సమితి కార్యాలయమా!

March 17, 2018


img

తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితికి చట్టబద్దత కల్పించి, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించిన సంగతి అందరికీ తెలిసిందే. సమితికి ప్రభుత్వం డైరెక్టర్లను, సభ్యులను, నిధులు అన్నీ సమకూర్చింది కానీ కార్యాలయమే ఏర్పాటు చేయలేదు. కనుక హైదరాబాద్ బషీర్ బాగ్ లోగల రాష్ట్ర వ్యవసాయ కమీషనరేట్ లో దానికి కార్యాలయం ఏర్పాటు చేసింది. 

ఈ సమితులకు చట్టబద్దత కల్పించినప్పటికీ, అవి తెరాస నేతలు, కార్యకర్తలతోనే నింపబడ్డాయనే సంగతి అందరికీ తెలిసిందే. కనుక ఇంతవరకు ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు మాత్రమే కనిపించే వ్యవసాయ కమీషనరేట్ కార్యాలయంలో ఇప్పుడు తెరాస నేతలు, గులాబీ కండువాలు దర్శనమిస్తున్నాయి. వారందరూ అధికార పార్టీకి చెందినవారు కనుక అధికారులు, ఉద్యోగులపై కాస్త ‘రువాబు’ కూడా ప్రదర్శించడం సహజమే. ఏప్రిల్ లో పంట పెట్టుబడి చెక్కులు రాబోతున్నాయి...అవి సమితి సభ్యుల చేతుల మీదుగానే పంపిణీ చేయాలి కనుక గులాబీ నేతల హడావుడి ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీని కోసం వారు అప్పుడే అధికారులు, ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయశాఖ అధికారులు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి తమకు ఎదురవుతున్న ఈ కొత్త ఇబ్బందుల గురించి మోరపెట్టుకొన్నట్లు తెలుస్తోంది. కమీషనరేట్ కార్యాలయంలో నుంచి తెలంగాణా రైతు సమన్వయ సమితి కార్యాలయం మార్చడమే ఈ సమస్యలకు పరిష్కారమని వారు మొరపెట్టుకొన్నట్లు తెలుస్తోంది. మార్చకపోతే ప్రభుత్వ కార్యాలయం కాస్తా తెరాస కార్యాలయంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. 



Related Post