అది కేసిఆర్ అహంకారానికి నిదర్శనం: మందకృష్ణ

March 17, 2018


img

ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటంపై మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో స్పందిస్తూ, “ఈ అంశంపై కేంద్రం చాలా మొండివైఖరితో ఉంది. ప్రస్తుతం మనకున్న బలంతో దానిని ఒప్పించడం కష్టం. అధికారంలో ఉన్న మేమే కేంద్రాన్ని ఒప్పించలేకపోతునప్పుడు ఇక మందకృష్ణ మాదిగ ఏవిధంగా ఒప్పించగలరు? అది అయన వల్ల కాని పని. నేను జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటున్నాను కనుక అంతవరకు అయన ఓపిక పడితే నేనే స్వయంగా బలం కూడగట్టుకొని కేంద్రం మెడలువంచి ఎస్సీ వర్గీకరణకు ఒప్పిస్తానని మాదిగ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. కనుక అంతవరకు ఈ సమస్యపై ఎవరూ హడావుడి చేయవద్దు. చేసేవారి మాటలను నమ్మవద్దు,” అని కెసిఆర్ అన్నారు. 

కానీ మందకృష్ణ మాదిగ కెసిఆర్ మాటలను తప్పు పట్టారు. “కెసిఆర్ కు అబద్దాలు చెపుతూ కాలక్షేపం చేయడం మోసాలు చేయడం అలవాటు. అయన చెప్పిన మాటలు ఆ అలవాట్లకు పరాకాష్టగా నిలుస్తున్నాయి. తనను ప్రశ్నించేవారిని నయాన్నో భయన్నో అణచివేయడం ఆయన నైజం. ఈ సమస్యపై పోరాడుతున్న మమ్మల్ని కూడా అణచివేయాలని చూస్తున్నారు. ఈ పార్లమెంటు సమావేశాలలో దీనిపై బిల్లు ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తుంటే కెసిఆర్ ఆవిధంగా మాట్లాడటం అయన అహంకారానికి నిదర్శనం. అయన మాకు సహాయపడినా పడకున్నా మా ఉద్యమం ఆగదు. ఈనెల 20వ తేదీ నుంచి జిల్లా, మండల కేంద్రాలలో ధర్నాలు ప్రారంభిస్తాము.  21 నుంచి డిల్లీలో దీక్షలు, ధర్నాలు చేస్తాము. అప్పటికీ కేంద్రం స్పందించకపోతే, జాతీయ స్థాయిలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న శక్తులన్నిటినీ కూడగట్టుకొని కేంద్రంపై రాజకీయ పోరాటం ప్రారంభిస్తాము. పొరుగు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచాలని పోరాడుతున్న తెరాస ఎంపిలు ఎస్సీ వర్గీకరణ చేయాలని పార్లమెంటులో అడగలేరా? దీనిపై తెరాసకు ఆసక్తి లేదు కనుకనే మా సమస్యను ఆ పార్టీ పట్టించుకోవడం లేదు,” అన్నారు.


Related Post