మహిళలు లొంగిపోవడమే మంచిది: మాజీ డిజిపి

March 16, 2018


img

నిర్భయ సామూహిక అత్యాచారం కేసు గురించి అందరికీ తెలిసిందే. హృదయవిదారకరమైన ఆ ఘటన జరిగి నేటికి ఐదున్నర సంవత్సరాలు పూర్తయినా నేటికీ దోషులకు శిక్షలుపడలేదు. అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే, సుమారు 65 ఏళ్ళు వయసున్న కర్నాటక రాష్ట్ర మాజీ డిజిపి హెచ్.టి.సంగ్లియా వారి కంటే హీనంగా వ్యవహరించారు. అయన ఒక మానసిక వ్యబిఛారినని నిరూపించుకొన్నారు. 

మహిళలపై అత్యాచారాలను వ్యతిరేకిస్తూ డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి హెచ్.టి.సంగ్లియాను ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో నిర్భయ తల్లి ఆశాదేవికూడా పాల్గొన్నారు. ఆమెను ఉద్దేశ్యించి సంగ్లియా మాట్లాడుతూ, “ఈమే ఇంత అందంగా ఉంటే ఈమె కూతురు నిర్భయ ఇంకెంత అందంగా ఉంటుందో ఊహించుకోవచ్చు”, అని అన్నారు. ఆ కార్యక్రమానికి హాజరైనవారందరూ ఆయన అన్న ఈ మాటలు విని దిగ్భ్రాంతి చెందారు. వారు తేరుకొనేలోపే అయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, “మహిళలందరికీ నా సలహా ఏమిటంటే, మీరు ఎంత బలవంతులైనప్పటికీ మీపై ఎప్పుడైనా అత్యాచారం ప్రయత్నం జరిగితే ఎదురుతిరగకండి. లొంగిపొండి. ఎదురుతిరిగితే మీ ప్రాణాలకే ప్రమాదం. అత్యాచారం జరిగిన తరువాత మీరు పోలీసులకు పిర్యాదు చేసినట్లయితే వారు దోషులను పట్టుకొని మీకు న్యాయం చేస్తారు,” అని అన్నారు. 

ఆ కార్యక్రమ నిర్వాహకులు వారిస్తున్నప్పటికీ అయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ కార్యక్రమానికి వచ్చిన మహిళలు అయన మాటలు విని తీవ్రఆగ్రహం చేశారు. మీడియా సమక్షంలో అయన మాట్లాడటంతో అవి కార్చిచ్చులాగ అంతటా పాకిపోయాయి. దానిపై దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

దీనిపై ఆశాదేవి స్పందిస్తూ, “ఈవిధంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేసే బదులు లైంగిక దాడులకు వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటం గురించి మాట్లాడి ఉండి ఉంటే ఆయనకు గౌరవంగా ఉండేది. కానీ కాలం మారుతున్నా కొంతమంది మగాళ్ళ ఆలోచనలలో ఎటువంటి మార్పు రాలేదని అయన మాటలు నిరూపిస్తున్నాయి,” అని అన్నారు.

తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు, నిరసనలు మొదలవడంతో సంగ్లీయా స్పందిస్తూ “నేనేమి తప్పు మాట్లాడాను? నేను అందం ఉన్నానని ఎవరైనా అంటే నేను చాలా సంతోషిస్తాను తప్ప అవమానంగా భావించను. అదే ఉద్దేశ్యంతో ఆశాదేవి గురించి నేను ఆవిధంగా మాట్లాడాను. మహిళలు తమ ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆవిధంగా చెప్పాను తప్ప వేరే దురుదేశ్యం లేదు. కనుక నా మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. దీన్ని అనవసరంగా పెద్ద సమస్యగా చేస్తున్నారు,” అని అన్నారు. 

ఒక రాష్ట్రానికి డిజిపిగా పనిచేసిన వ్యక్తి అంత వయసులో కూడా మహిళల పట్ల ఇంత నీచమైన అభిప్రాయం వ్యక్తం చేయడం శోచనీయం. ఇంత నీచమైన మనస్తత్వం ఉన్నవ్యక్తి డిజిపిగా ఉంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో? 


Related Post