మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు?

March 15, 2018


img

అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ పై దాడి చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వం రద్దు చేసిన తెరాస సర్కార్, అదే కేసులో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకొనే యోచనలో ఉన్నట్లు శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి హరీష్ రావు చెప్పారు. ఆరోజు శాసనసభలో జరిగిన ఘటనల వీడియోలను స్పీకర్ మధుసూధనాఛారి పరిశీలించి తగు నిర్ణయం తీసుకొంటారని హరీష్ రావు చెప్పారు. తెరాస సర్కార్ ఏకపక్షంగా ఇద్దరు కాంగ్రెస్ సభ్యులను బహిష్కరించిందనే కాంగ్రెస్ నేతల వాదనలను అయన త్రోసిపుచ్చారు. సభలో మెజారిటీ సభ్యులు అందరి ఆమోదంతోనే ఆ నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తాను గవర్నర్ నరసింహన్ పైకి  హెడ్ ఫోన్స్ విసిరితే అది మండలి చైర్మన్ స్వామి గౌడ్ కు తగిలిందని చెప్పుకోవడం ద్వారా అయన స్వయంగా తను చేసిన తప్పును దృవీకరించారని, కనుక ఆయనపై చర్యలు తీసుకొంటే తప్పేమిటని ప్రశ్నించారు. ఒకవేళ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడినట్లు స్పీకర్ గుర్తిస్తే వారిపై కూడా కటినచర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.       



Related Post