కోదండరాం సభకు నో పర్మిషన్!

March 09, 2018


img

తెలంగాణా సాధనలో భాగంగా మార్చి 10, 2011న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై పది లక్షల మంది ప్రజలతో టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిర్వహించిన ‘మిలియన్ మార్చ్’ తెలంగాణా రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ ఒక గొప్ప చారిత్రిక ఘట్టంగా నిలిచిపోతుంది. అయన స్థాపించబోతున్న తెలంగాణా జన సమితి (టిజెఎస్) అనే రాజకీయపార్టీ ఆవిర్భావ సభను మార్చి 10వ తేదీన నిర్వహించాలనుకొన్నారు. అయితే దానిపై అయన ఇంత వరకు అధికారిక ప్రకటన చేయలేదు. మిలియన్ మార్చ్ జరిపి ఏడేళ్ళు పూర్తయిన సందర్భంగా రేపు అంటే మార్చి 10న ట్యాంక్ బండ్ పై వివిధ పార్టీల అధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవాలనుకొంటున్నామని అయన తెలిపారు.

ట్యాంక్ బండ్ పై తన పార్టీ ఆవిర్భావ సభ జరుపుకొంటామంటే పోలీసులు అనుమతించరనే ఉద్దేశ్యంతోనే ఆవిధంగా చెప్పి ఉండవచ్చు. తన పేరు చెపితే దానికైనా పోలీసులు అనుమతించకపోవచ్చునని భావించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి ద్వారా ఈ నెల 2న సభకు పోలీసుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేయించారని సమాచారం. అయితే పోలీసులు ఆ మాత్రం ఊహించలేరనుకొంటే అమాయకత్వమే. అందుకే మిలియన్ మార్చ్ కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్నందున నగరంలో బారీ జనసమీకరణ చేసి సభలు నిర్వహించడానికి అనుమతించలేమని డిసిపి జోయాల్ డేవిస్ వారికి తెలియజేశారు. అదీగాక..ఈ కార్యక్రమాన్ని అనుమతిస్తే దానిలో సంఘ  విద్రోహ శక్తులు చొరబడి నగరంలో విద్వంసం సృష్టించే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశ్యంతో అనుమతి నిరాకరిస్తున్నట్లు చెప్పారు. 

పోలీసులు అనుమతి నిరాకరించడంతో టిజెఏసి నేతలు తమ పార్టీ ఆవిర్భావ సభను ఎప్పుడు ఎక్కడ జరుపుకోవాలనే విషయంపై చర్చిస్తున్నారు.


Related Post