వాళ్ళు చట్టబద్దమైన బందిపోట్లు

February 24, 2018


img

వేసవి కాలం..తరువాత వర్షాకాలం..తరువాత శీతాకాలం...వచ్చినట్లుగా ఇప్పుడు బ్యాంకుల దోపీడీ సీజన్ నడుస్తున్నట్లుంది. ఏడాదిన్నర క్రితం విజయ్ మాల్యాతో మొదలైన ఈ ‘గ్రేట్ డే-లైట్ రాబరీ సీజన్’ లో నీరవ్ మోడీ, విక్రం కొఠారిలు కంటిన్యూ చేస్తున్నారు. ఆ జాబితాలో తాజాగా డిల్లీకి చెందిన వజ్రాల వ్యాపార సంస్థ ద్వారకానాథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా చేరించి. ఆ సంస్థ డైరెక్టర్లు సభ్య సేథ్‌,  రీటా సేథ్‌, కృష్ణ కుమార్‌ సింగ్‌, రవి సింగ్‌ యజమానులు కూడా నీరవ్ మోడీ పద్దతిలోనే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు రూ.389.85 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ భాగోతం 6 నెలల క్రితమే బయటపడింది. అప్పుడే బ్యాంక్ అధికారులు సిబిఐకి పిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన సిబిఐ వారు ఉద్దేశ్యపూర్వకంగానే బ్యాంకును మోసం చేయడానికి ప్రయత్నించారని కనుగొని వారిపై కేసులు నమోదు చేసింది. కానీ ఈ విషయం ఇప్పటి వరకు బయటకు పొక్కలేదు. ఇప్పుడు ఇటువంటి డే-లైట్ బ్యాంక్ దోపిడీ కధలు ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియాలో రోజూ వస్తున్నాయి కనుక ఇదీ బయటపడినట్లుంది. బహుశః రానున్న రోజులలో ఇటువంటి దోపిడీ కధలు మరిన్ని బయటపడినా ఆశ్చర్యం లేదు.

చీకటి పడిన తరువాత అర్ధరాత్రి బ్యాంకులకు కన్నాలు వేసే దొంగలను పోలీసులు పట్టుకోగలరు కానీ పట్టపగలే దర్జాగా బ్యాంక్ నుంచి ‘అప్పులు’ పేరుతో వందల కోట్లు ఎత్తుకుపోతున్నవారిని సిబిఐ కూడా ఏమీ చేయలేకపోతోంది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటివారు ఆర్దికనేరగాళ్ళు తమ కళ్ళముందే విదేశాలకు పారిపోతున్నా, అక్కడ దర్జాగా జీవిస్తున్నా వారికి అప్పులిచ్చిన బ్యాంకులు, కేంద్రప్రభుత్వం, ఈడి, ఆదాయపన్ను శాఖ, నిఘా సంస్థలు, న్యాయస్థానాలు...ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. అటువంటి వాళ్ళందరూ ‘చట్టబద్దమైన బందిపోట్లు’ అని తెలంగాణా రైతు సంఘం ఉపాధ్యక్షుడు చంద్రారెడ్డి అన్నారు. నిజమే కదా!


Related Post