సింగరేణి కార్మికులకు శుభవార్త

February 24, 2018


img

సింగరేణి కార్మికులకు ఒక శుభవార్త! వారు స్వంత ఇళ్ళు నిర్మించుకోవడానికి రూ.10 లక్షల వరకు తీసుకొన్న రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల సమయంలో టిబిజికెఎస్ తరపున ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు కవిత, ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి కార్మికులు స్వంత ఇళ్ళు కట్టుకోవడానికి రూ.10 లక్షలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వారిచ్చిన ఆ హామీ మేరకు సింగరేణి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకొంది.

కొత్తగా రుణాలు తీసుకోబోతున్నవారికే కాకుండా, ఇప్పటికే రుణాలు తీసుకొన్నవారికి కూడా ఇది వర్తింపజేస్తామని, అలాగే ఇంతవరకు కార్మికులు చెల్లించిన వడ్డీలను కూడా వాపసు చేస్తామని సింగరేణి చైర్మన్ ఎండి ఎన్ శ్రీధర్ చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. దీని వలన సింగరేణిపై రూ.130 కోట్లు ఆర్దికభారం పడుతుందని అంచనా వేశారు. సింగరేణి బోర్డు తీసుకొన్న ఈ నిర్ణయంపై కార్మికులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలోనే మంచిర్యాల్ పర్యటనకు వచ్చినప్పుడు ఆరు ఓపెన్ కాస్ట్ గనులను ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటివలన కొన్ని వందల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 


Related Post