ఆధార్ లేకుంటే బినామీలే

February 24, 2018


img

తెలంగాణా రాష్ట్రంలో సమగ్ర భూసర్వే నిర్వహించి భూరికార్డులను ప్రక్షాళించిన తరువాత ఆ రికార్డుల ఆధారంగా రైతులందరికీ మార్చి 11 నుంచి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న ప్రగతి భవన్ లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు అందరూ ఎంతో శ్రమపడి సంక్లిష్టమైన సర్వే పనిచేశారని, కనుక రైతులకు జారీ చేయబోయే కొత్త పాస్ పుస్తకాలలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవకతవకలు నిరోధించడానికి ప్రతీ పాస్ పుస్తకాన్ని ఆధార్ తో తప్పనిసరిగా అనుసంధానించాలని లేకుంటే అటువంటి ఆస్తులను బినామీ ఆస్తులుగా గుర్తిస్తామని రైతులకు తెలియజేయాలన్నారు. కనుక ఇంకా ఆధార్ నెంబర్ ఇవ్వని రైతులందరికీ మరోసారి గుర్తుచేసి తప్పనిసరిగా ఆధార్ తీసుకోవాలని సూచించారు.

రైతులకు సాగుచేసుకొంటున్న స్వంతభూమితో పాటు గ్రామంలో లేదా మరే ప్రాంతంలోనైనా అసైన్డ్ భూమి కూడా ఉన్నట్లయితే ఆ వివరాలను కూడా పాస్ పుస్తకాలలో నమోదు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు అందించబోయే పాస్ పుస్తకాలలో రైతు యాజమాన్య హక్కులను స్పష్టంగా దృవీకరించేవిధంగా ఉండాలని అన్నారు. మార్చి 11న పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలను కొంటున్నప్పటికీ దాని కోసం రైతుల వివరాలను నమోదు చేయడంలో ఎటువంటి తప్పులు జరుగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి కోరారు.   

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ప్రత్యేకాధికారి వి.అరుణ, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. 


Related Post