ఆ సమితిలకు కార్పోరేషన్

February 23, 2018


img

రాష్ట్రంలో రైతాంగ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలంగాణా రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిని అన్ని విధాలుగా బలోపేతం చేసి రైతులకు సంబంధించి అన్ని వ్యవహారాలను అవే స్వయంగా పర్యవేక్షించుకొనేలా చేసేందుకు వాటికి మూలధనంగా రూ.200 కోట్లు నిధులు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పంట పెట్టుబడి చెక్కులను కూడా వాటి ద్వారానే రైతులకు పంపిణీ చేయాలనుకొంటోంది. అయితే వాటికి చట్టబద్దత కల్పించకపోతే అవి ఆర్ధిక లావాదేవీలు నిర్వహించలేవు.  పైగా న్యాయపరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కనుక వాటికి కార్పోరేషన్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 

‘తెలంగాణా రైతు సమన్వయ సమితి’ పేరిట ఏర్పాటు చేస్తున్న ఆ కార్పోరేషన్ పాలక మండలిలో అధ్యక్షుడితో కలిపి మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వారిలో ఈ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్ధికశాఖ అధికారి,  వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ఉద్యానవన కమీషనర్ లతో బాటు 10 మంది సమితి సభ్యులు ఉంటారు. 

గ్రామ, మండల స్థాయి తెలంగాణా రైతు సమన్వయ సమితిల ఏర్పాటు పూర్తయింది కనుక త్వరలోనే జిల్లా రాష్ట్ర స్థాయి సమితిల నిర్మాణం కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. రైతులు తమ సమస్యలపై చర్చించుకొని పరిష్కరించుకోవడానికి, వ్యవసాయానికి సంబంధించిన విషయాలపై చర్చించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో శాశ్విత 2,630 వేదికలను (భవనాలను) నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. వీటి నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను తెలంగాణా రైతు సమన్వయ సమితిలకే అప్పగించాలని నిర్ణయించారు.


Related Post