జైట్లీని కెసిఆర్ ఒప్పించగలరా?

February 15, 2018


img

ఈ మే నెల నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఎకరానికి ఒక పంటకు రూ.4,000 పంట పెట్టుబడిగా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది. అయితే, రైతులందరూ ఒకేసారి ఆ చెక్కులను మార్చుకోవడానికి బ్యాంకుల ముందు క్యూ కడతారు కనుక ఆ సమయంలో బ్యాంకులలో దీని కోసమే కనీసం 6,000 కోట్లు నగదు నిలువ ఉంచవలసిందిగా మంత్రి ఈటెల రాజేందర్ ఇదివరకే కేంద్ర ఆర్ధికమంత్రి జైట్లీని కోరారు. 

ఈ పంట పెట్టుబడికి అవసరమైన సొమ్ము సమీకరణకు కూడా సమస్య ఎదురయినట్లు తెలుస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి రుణాలను సేకరించుకొనే ప్రక్రియ జూన్ చివరి నాటికి పూర్తవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మే 15వ తేదీ నుంచి చెక్కులు పంపిణీ చేయాలని భావిస్తునందున,  2018-19 ఆర్ధిక సవత్సరం మొదట్లోనే అంటే ఏప్రిల్ మొదటివారంలోనే ఆ నగదు సిద్దం చేసుకోవలసి ఉంటుంది. కనుక ముందుగానే నాబార్డ్ లేదా వేరే ఆర్ధిక సంస్థల నుంచి రుణం తీసుకొనేందుకు తమ ప్రభుత్వాన్ని అనుమతించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్ధికమంత్రి జైట్లీని కోరనున్నారు. 

ఇదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం నాబార్డ్ నుంచి రూ.10,000 కోట్లు రుణం ముందుగా తీసుకొనేందుకు అనుమతించాలని కోరనున్నారు. ఇదివరకు రాష్ట్ర మంత్రులు జైట్లీని ఇదే విషయమై అభ్యర్ధించినప్పుడు అయన స్పందించలేదు. కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అభ్యర్ధనను జైట్లీ మన్నిస్తారో లేదో చూడాలి. మన్నించకపోతే రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలద్వారా నిధులను సమకూర్చుకోవలసి ఉంటుంది. 


Related Post