పాపం హరికృష్ణ నాయక్!

February 13, 2018


img

అతని పేరు హరికృష్ణ నాయక్. మహబూబ్ నగర్ జిల్లాలో నవాబుపేట మండలంలో బట్టోనిపల్లి అనే మారుమూల కుగ్రామం. ఒక నిరుపేద గిరిజనులైన రాం చందర్, హేమ్లీ బాయి అతని తల్లితండ్రులు. ఈ నేపధ్యంలో హరికృష్ణ నాయక్ ఏమి చేస్తుంటాడో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అతను అష్టకష్టాలు భరిస్తూ పట్టుదలతో చదువుకొని బి.టెక్ చేశాడు. అందరి తను కూడా ఉద్యోగాలకు ప్రాకులాడకుండా తనే పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనుకొన్నాడు. అందుకే సాఫ్ట్ వేర్ కోర్సులలో శిక్షణ తీసుకొని వాటిపై మంచి పట్టు సాధించాడు. తన కలలను, ఆశయాలను నిజం చేసుకోవడానికి రూ.40 లక్షలు అప్పు తీసుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హరిభారతి ఆర్గనైజేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్ వేర్ సంస్థను స్థాపించి దానిలో 22 మందికి ఉద్యోగాలు ఇచ్చేడు.

ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఆ తరువాతే అతను ఊహించలేని సమస్యలు ఎదురయ్యాయి. సాఫ్ట్ వేర్ ప్రాజెక్టుల కోసం అతను చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ప్రభుత్వం నుంచి కూడా సహకారం లభించలేదు. దాంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి. మరోపక్క చేసిన అప్పుకు వడ్డీలు పెరిగిపోవడంతో ఇంకా ఒత్తిడి పెరిగిపోయింది. అయినప్పటికీ హరికృష్ణ నాయక్ ప్రాజెక్టు పనులు సంపాదించడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఫలితం కనబడలేదు. దాంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైన అతను మొన్న శనివారం రాత్రి తన కార్యాలయంలోనే ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. 

 ఒక గిరిజన యువకుడు ఇంత పట్టుదలగా కష్టపడి చదువుకొని జీవితంలో ఏదో సాధిద్దామనుకొన్నాడు. అతను అనుకొన్నవన్నీ దాదాపు సాధించిచూపాడు కూడా. కానీ సకాలంలో ప్రభుత్వం తోడ్పాటు లభించకపోవడంతో కష్టాలు చుట్టుముట్టాయి. అయితే అతని విషయంలో ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టలేము. అతనివంటి వారెందరినో ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తోంది. అవసరమైన సహాయసహకారాలు అందిస్తోంది. దురదృష్టవశాత్తు హరికృష్ణ నాయక్ కు ఆ సహాయం అందకపోయుండవచ్చు. ఆ నిరాశ నిస్పృహలతో అతను ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమే. నలుగురి జీవితాలలో వెలుగులు నింపాలనుకొన్న దీపమే ఆరిపోయింది. పాపం హరికృష్ణ నాయక్! 


Related Post