ఇంతకీ బొడ్డుపల్లి హత్యకు ఎవరు కారకులు?

February 13, 2018


img

నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై కాంగ్రెస్-తెరాస నేతల మద్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ఆరోపణలపై మంత్రి జగదీశ్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. 

తెరాస నుంచి సస్పెండ్ అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ మళ్ళీ తెరాసలోకి రావాలనుకొన్నాడని, బహుశః అందుకే అతను హత్య చేయబడి ఉంటాడని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. జిల్లాలో మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉండగా, ఒక్క కోమటిరెడ్డి సోదరులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే తరచూ ఇటువంటి ఘర్షణలు, హత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. శ్రీనివాస్ ను అతని అనుచరులే చంపేశారని మొదట ఆరోపించిన అతని భార్య లక్ష్మి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమెను కలిసిన తరువాత ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేతలు ఎవరైనా, ఎప్పుడైనా ప్రభుత్వానికి లేదా పోలీసులకు పిటిషన్ ఇచ్చారా? అని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు హత్యారాజకీయలు చేస్తూ తిరిగి తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇటువంటి అబద్దపు ప్రచారాలతో తమ ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతలకు వచ్చే ఎన్నికలలో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

ఒకపక్క ఈ హత్యకేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతుంటే, బాధ్యతగా వ్యవహరించవలసిన కాంగ్రెస్, తెరాస ఎమ్మెల్యేలు శ్రీనివాస్ హత్యకు మీరు కారణం అంటే కాదు..మీరే హత్య చేయించారని ఆరోపించుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. శ్రీనివాస్ హత్యతో రెండు పార్టీలకు సంబంధం లేనప్పుడు మరి ఆయనను ఎవరు హత్య చేయించారు? పోలీసులే తేల్చాలి. 


Related Post