వరంగల్ జిల్లాకు ప్రత్యేక ఆకర్షణ?

January 20, 2018


img

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ అర్బన్ జిల్లాకు త్వరలో ఒక ప్రత్యేక ఆకర్షణ సమకూరబోతోంది. వరంగల్-హన్మకొండ-ఖాజీపేట పట్టణాలను కలుపుతూ ‘మోనో రైల్’ ఏర్పాటు చేయడానికి ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణతో పోలిస్తే మోనో రైల్ చాలా చవుక కనుక అనేకదేశాలలో మోనో రైళ్ళు విజయవంతంగా సాగుతున్నాయి. వరంగల్-ఖాజీపేట మద్య రూ.1,200 కోట్ల పెట్టుబడితో మోనో రైల్ ఏర్పాటు చేయడానికి స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటమిన్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీని కోసం కొన్ని నెలల క్రితమే వరంగల్-ఖాజీపేట మార్గంలో సర్వే కూడా పూర్తి చేసి అక్కడ మోనో రైల్ నిర్వహణ లాభసాటిగానే ఉంటుందని తేల్చి చెప్పింది.

మోనో రైల్ ఏర్పాటుకు పెద్దగా భూసేకరణ అవసరం ఉండదు. ప్రస్తుతం ఉన్న రోడ్డు డివైడర్లలోనే ఒంటి స్థంభాలు నిర్మించి, వాటిపై వేరేచోట తయారుచేసిన వంతెన విడిభాగాలు (ప్రీ-కాస్ట్ స్లాబ్) తెచ్చి బిగించి మోనో రైల్ ట్రాక్ ఏర్పాటు చేయవచ్చు. కనుక ఒక కిలోమీటరుకు నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు చొప్పున హన్మకొండ-ఖాజీపేట మద్యగల 12 కిమీలకు రూ.1200 కోట్లు ఖర్చవుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. కనుక మెట్రో రైల్ తో పోలిస్తే మోనో రైల్ టికెట్ ధరలు కూడా చాలా తక్కువగానే ఉండవచ్చు. అందుకే అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో మోనో రైల్ నే ఎక్కువగా ఏర్పాటు చేస్తుంటారు.   

ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో దావోస్ లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’లో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్ పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో తెలంగాణా ప్రభుత్వం- ఇంటమిన్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ మద్య దీనికోసం ఒప్పందం జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని అప్పగించినప్పటి నుంచి సరిగ్గా 12-18 నెలలోనే ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ 2019 లోగా హన్మకొండ-ఖాజీపేట మద్య మోనో రైల్ పరుగులు తీసే అవకాశం ఉందన్నమాట! 


Related Post