రేవంత్ రెడ్డి టిటిడిపిని హైజాక్ చేశారు: రేవూరి

January 20, 2018


img

టిటిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తెదేపాను తెరాసలో విలీనం చేసేయాలని చంద్రబాబు నాయుడుకు చేసిన సూచనపై ఆ పార్టీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తాం..పూర్వ వైభవం తీసుకువస్తాం అని ప్రగల్భాలు పలికిన ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి నేతలు నిసిగ్గుగా తెరాసలో చేరిపోయారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి కొంతకాలం పాటు పార్టీని హైజాక్ చేసి పేరు సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోత్కుపల్లి నరసింహులు వంతు వచ్చినట్లుంది. పార్టీని ఎలా కాపాడుకోవాలని ఆలోచించకుండా, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనం కోసం పార్టీని తెరాసలో విలీనం చేసేయాలని ఉచిత సలహా ఇవ్వడం సిగ్గుచేటు. ఆయనకు తెరాసలో చేరాలనే కోరిక ఉంటే వెళ్ళి చేరవచ్చు కానీ పార్టీ భవిష్యత్ ను నిర్ణయించే అధికారం ఆయనకు లేదు.

తెలంగాణాలో ఎప్పటికీ తెదేపా ఉంటుంది. అవకాశం వస్తే తప్పకుండా మళ్ళీ పూర్వ వైభవం సాధిస్తుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ భయం కూడా అదే. రాష్ట్రంలో తెదేపా ఉన్నంతవరకు తెరాసకు ప్రమాదమేననే భయమే ఆయనను మా పార్టీ నేతలను టార్గెట్ చేసేలా చేస్తోంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, తెరాసల మద్యనే ముఖాముఖి పోటీ ఉండబోతోంది. కానీ ఎవరు అధికారంలోకి రావాలన్నా తెదేపా మద్దతు తప్పనిసరి అవుతుందని మేము భావిస్తున్నాము. వచ్చే ఎన్నికల తరువాత తెదేపా కింగ్ మేకర్ కాబోతోందని నేను గట్టిగా చెప్పగలను. అప్పుడు తెరాసకు మద్దతు ఇవ్వాలా లేక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా అనే విషయం మా అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారు. పార్టీలో ఎవరు ఉన్నా వెళ్ళిపోయినా మేము ప్రాణం ఉన్నంత వరకు తెదేపాలోనే కొనసాగుతాము,” అని అన్నారు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రేవూరి, ఎల్ రమణ పాల్గొన్నప్పుడు ఈవిషయాలు చెప్పారు. 


Related Post