ప్రదీప్ మత్తు దిగిపోయినట్లే ఉంది

January 19, 2018


img

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకొన్న టీవీ యాంకర్ ప్రదీప్ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన ప్రదీప్, ఆ తరువాత కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ట్రాఫిక్ పోలీసులు చేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని జనవరి 8న ఘోషామహల్ జరిగిన పోలీస్ కౌన్సిలింగ్ కు తన తండ్రితో కలిసి హాజరయ్యారు. వారి సూచన మేరకు ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. 

సాధారణంగా ఇటువంటి కేసులలో చిక్కుకొన్న సెలబ్రెటీలు చేసే తప్పే ప్రదీప్ కూడా చేశారని చెప్పవచ్చు. పోలీసుల కేసులు, అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తమ గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తుంటారు. ప్రదీప్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తే అయినప్పటికీ అతనిని కూడా మీడియా విడిచిపెట్టకుండా కాకులు పొడిచినట్లు పొడవడటం గమనిస్తే, మన మీడియా రేటింగ్ పెంచుకోవడం కోసం ఎవరితోనైనా ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో అర్ధం అవుతుంది. ప్రదీప్ కూడా ఆ బాధను, మానసిక క్షోభను అనుభవించిన తరువాతే పోలీసుల ముందుకు వచ్చిలొంగిపోయారు. అయితే పోలీసులు మీడియా అంత కటినాత్ములుకారని ప్రదీప్ ఈపాటికి గ్రహించే ఉంటారు. అయన చేసిన తప్పును పోలీసులు గుర్తించినప్పుడే అయన వారి సూచనలను పాటించి ఉండి ఉంటే ఈపాటికే ఈ కేసు నుంచి బయటపడి ఉండేవారు. ఏది ఏమైనప్పటికీ చట్టప్రకారం జరుగవలసి ప్రక్రియకు ప్రదీప్ హాజరయ్యి తన తప్పును సరిదిద్దుకొన్నారు కనుక ఈ కధ ఇక్కడితో సుఖాంతం అవుతుందని ఆశిద్దాం. 


Related Post