ఏపిలో కెసిఆర్ ఫ్లెక్సీ బ్యానర్

January 17, 2018


img

తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రి కెసిఆర్ ను, అయన పాలనను ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ, అయనకు ఇరుగుపొరుగు రాష్ట్రాలలో నానాటికీ ఆదరణ పెరుగుతూనే ఉందని చెప్పడానికి నిదర్శనంగా మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలోని ఏడిద గ్రామంలో ఆయన చిత్రం ఉన్న ఫ్లెక్సీ బ్యానర్ వెలిసింది. 

సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరిలో ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీ బ్యానర్ లో ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ చిత్రాలు మద్యలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రం ముద్రించారు. ‘జై జవాన్..జై కిసాన్’ నినాదానికి సంకేతంగా పైన ఒక వైపు రైతన్న, మరోవైపు జవాను చిత్రాలను మద్యలో బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించారు. దీనిని కూరటి చిన్న, అందుకూరి వెంకటేశ్వరులు అనే ఇద్దరు స్థానికులు ఏర్పాటు చేశారు. 

ఏపిలో చంద్రబాబు ఫ్లెక్సీలు, తెలంగాణాలో కెసిఆర్  ఫ్లెక్సీలు, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాని మోడీ ఫ్లెక్సీలు కనిపించడం సర్వసాధారణమైన విషయమే కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రం ఉన్న ఫ్లెక్సీ ఏపిలో కనిపించడమే అయన ప్రత్యేకతను తెలియజేస్తోంది. 

రాష్ట్ర విభజన తరువాత అనేక ఆశలు, అంచనాలు, ఆకాంక్షలతో ఏపి ప్రజలు చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో అధికారం కట్టబెట్టారు. కానీ అవేవీ నెరవేరకపోగా ఏపిలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయిప్పుడు. అదే సమయంలో తెలంగాణాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడు గుర్రాలమాదిరిగా దూసుకుపోతుండటం అందరి కళ్ళకు ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంది. కనుక అందుకు కారకుడైన ముఖ్యమంత్రి కెసిఆర్ పట్ల ఏపి ప్రజలలో గౌరవం పెరగడం సహజమే. అదే అప్పుడప్పుడు ఈవిధంగా బయటపడుతోంది. 


Related Post