ఈ గవర్నర్ మాకొద్దు: ఏపి బిజెపి

January 16, 2018


img

గవర్నర్ నరసింహన్ పై ఏపి భాజపా యుద్ధం ప్రకటించింది. ఆయన తెలంగాణా పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని విశాఖ భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించిన మూడు రోజులకే, ఏపి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు కూడా గవర్నర్ నరసింహన్ కు వ్యతిరేకంగా కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఒక లేఖ వ్రాశారు. దానిలో ఏపికి వేరేగా గవర్నర్ ను నియమించాలని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రజల అభిమతం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వాన్ని అమరావతికి తరలించి ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తున్నారు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించాలని రాష్ట్ర ప్రజల తరపున కోరుతున్నానని ఆ లేఖలో వ్రాసినట్లు తెలుస్తోంది. 

ఏపి భాజపా నేతలు ఏదో ఊసుపోక గవర్నర్ నియామకం గురించి మాట్లడుతున్నారనుకోలేము. ఏపిలో తెదేపా-భాజపాలు మిత్రపక్షంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కొనసాగుతున్నప్పటికీ వాటి మధ్య అంత సఖ్యత లేదనే సంగతి చాలాసార్లు బయటపడింది. తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో తెదేపా నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పించడం, అందుకు ప్రతిగా రాష్ట్ర భాజపా నేతలు తెదేపా సర్కార్ పై అవినీతి ఆరోపణలు చేయడాన్ని చెప్పుకోవచ్చు. కనుక రాష్ట్రంలో భాజపాకు అనుకూలమైన గవర్నర్ ను నియమించుకోగలిగితే, అయన లేదా ఆమె ద్వారా వచ్చే ఎన్నికలలోగా తెదేపాను అదుపుచేసి భాజపాకు తగినన్ని టికెట్స్ కేటాయింపజేసుకోవాలని ఆలోచిస్తున్నారేమో? లేదా మరేదైనా బలమైన కారణం ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరేగా గవర్నర్ ను నియమించాలని తెదేపా సర్కార్ కానీ తెదేపా నేతలు గానీ కోరడంలేదు కానీ భాజపా నేతలు కోరుతున్నారంటే ఏదో పరమార్ధం ఉండనే కదా?


Related Post