సిజెఐ దీపక్ మిశ్రాపై మళ్ళీ తీవ్ర ఆరోపణలు!

January 16, 2018


img

సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ బుధవారం తీవ్ర ఆరోపణలు చేయడంతో మళ్ళీ న్యాయవ్యవస్థలో కలకలం మొదలయింది. ఉత్తరప్రదేశ్ లో 46 మెడికల్ కాలేజీల అడ్మిషన్ల కుంభకోణంలో జస్టిస్ దీపక్ మిశ్రా హస్తం కూడా ఉందని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన సిబిఐ కూడా అదే దృవీకరించిందని అన్నారు. దీపక్ మిశ్రా కోడ్ బాషలో బత్తాయిపళ్ళు..మందిరాలు అంటూ మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంతకీ ఈ కేసు ఏమిటంటే,         

ఉత్తరప్రదేశ్ లో 46 మెడికల్ కాలేజీలను అనర్హమైనవిగా గుర్తించిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాటిలో జరిగిన అడ్మిషన్లను రద్దు చేసింది. దీంతో ఆ కాలేజీ యాజమాన్యాలు సుప్రీం కోర్టు చేత ఆ నిషేధాన్ని తొలగింపజేయడానికి ఓడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఇష్రత్ మశ్రూర్ ఖుద్దూసీతో ఒప్పందం కుదుర్చుకొన్నాయి. ఈ కుంభకోణంలో ఆయనకు భావన పాండే, మధ్యవర్తి విశ్వనాథ్ అగ్రావాలే సహకరించారు. వారు జస్టిస్ దీపక్ మిశ్రాతో ఒక ఒప్పందం కుదుర్చుకొన్నారని సిబిఐ దృవీకరించింది. అప్పుడు ఆయన ఈ మెడికల్ కాలేజీల కేసును చూస్తున్న జస్టిస్ చలమేశ్వర్ ను దాని నుంచి తప్పించి వేరే బెంచ్ కు అప్పగించడం, అది మెడికల్ కౌన్సిల్ విధించిన నిషేధాన్ని రద్దు చేయడం చకచకా జరిగిపోయాయి. 

ఈ కేసును దర్యాప్తు చేసిన సిబిఐ ఓడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఇష్రత్ మశ్రూర్ ఖుద్దూసీతో సహా ఆయనకు సహకరించిన వారిని అరెస్ట్ చేసింది కూడా. సిబిఐ అభియోగపత్రాలలో జస్టిస్ దీపక్ మిశ్రాతో సహా మరికొందరు సిట్టింగ్ జడ్జిల పేర్లను కూడా పేర్కొంది. ఈ ఆధారాలతో లక్నో పోలీస్ స్టేషన్లో జస్టిస్ దీపక్ మిశ్రాపై తాను కేసు పెట్టానని లాయర్ ప్రశాంత్ భూషణ్ చెప్పారు. 

సాక్షాత్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే ఇంత తీవ్రమైన ఆరోపణలు రావడం చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయమే. మరి దీనిపై కేంద్రప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. 


Related Post