రేవంత్ రెడ్డి- బాల్క సుమన్ బిగ్ ఫైట్...కాలక్షేపానికేనా?

January 12, 2018


img

విద్యుత్ కొనుగోళ్ళలో కూడా బారీగా అవినీతి జరిగిందని, దానిపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలు విసిరిన సవాలును తెరాస నేతలు బాల్క సుమన్, భాను ప్రసాద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి  స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన బహిరంగ చర్చకు సిద్దమని ప్రకటించారు. వేదిక, సమయాన్ని కాంగ్రెస్ నేతలే నిర్ణయించుకోమని ఆప్షన్ ఇచ్చారు. అయితే ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళివచ్చిన రేవంత్ రెడ్డితో తాము చర్చించడానికి అంగీకరించమని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ వంటి విశ్వసనీయత ఉన్న కాంగ్రెస్ నేతలతో మాత్రమే బహిరంగ చర్చకు సిద్దమని తెరాస నేతలు ప్రకటించారు.

వారి ప్రకటనపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “తెరాస నేతలు బహిరంగ చర్చకు సిద్దమని చెపుతూనే కుంటిసాకులు చూపి పారిపోతున్నారు. చర్చకు వస్తే తెరాస సర్కార్ బండారం బయటపడుతుందనే భయంతోనే చర్చకు వెనుకాడుతున్నారు. అయినా తెరాస సర్కార్ ను వదిలిపెట్టబోను. కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం మొదలు పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ళ వరకు అన్నిటిలో అక్రమాలు జరిగాయి. వాటిని ఆధారాలతో సహా శుక్రవారం మీడియా సమక్షంలో బయటపెడతాను,” అని హెచ్చరించారు.

అంతకు ముందు రేవంత్ రెడ్డి కూడా వారి సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించి ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లేదా తెరాస నేతలు ఎక్కడ కోరుకొంటే అక్కడ ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్దమని ప్రకటించారు. తన వెంట కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ వస్తారని ప్రకటించారు. కానీ తనతో బహిరంగ చర్చకు సమ్మతం కాదని తెరాస నేతలు చెప్పడంతో వారు చర్చకు రాకుండా తప్పించుకోవడానికే ఈ కుంటిసాకు చూపుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

తెరాస నేతలు రేవంత్ రెడ్డి కాకుండా వేరేవరితోనైనా బహిరంగ చర్చకు సిద్దమని చెపుతున్నప్పుడు, వారిని ఎదుర్కొని తెరాస సర్కార్ చేసిన ఆరోపణలను నిరూపించవలసిన బాధ్యత కాంగ్రెస్ నేతలపైనే ఉంటుంది. తెరాసను ఎదుర్కోవడానికి కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపై ఆధారపడాలనుకోవడం కాంగ్రెస్ బలహీనతను సూచిస్తోంది. తెరాస కుంటిసాకులు చూపి తప్పించుకొంటోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు కూడా అదేపని చేయడం ఎందుకు? తమ ఆరోపణలు నిజమని వారు భావిస్తున్నట్లయితే, వాటిని నిరూపించుకొనేందుకు రేవంత్ రెడ్డికి బదులు పార్టీలో సీనియర్ నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్ అలీ వంటివారు వెళ్ళవచ్చు కదా! కానీ రెండు పార్టీలు సవాళ్ళు విసురుకొని, చివరికి కుంటిసాకులతో తప్పించుకొనే ప్రయత్నం చేస్తుండటం చూస్తే ఇది రాజకీయ కాలక్షేప కార్యక్రమమే అని భావించాలేమో?


Related Post