నేతిబీరలో నెయ్యి...కాంగ్రెస్ మాటలలో నిజం ఉండదు

January 11, 2018


img

‘నేతి బీరకాయలో నెయ్యి... కాంగ్రెస్ నేతల మాటలలో నిజం ఉండదు’ అని తెరాస ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఎద్దేవా చేశారు. తెరాస సర్కార్ ఇతర రాష్ట్రాలు, ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తూ రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తోందని కాంగ్రెస్ నేతల ఆరోపణలకు తెరాస ఎంపి బాల్క సుమన్, తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘాటుగా జవాబు చెప్పారీరోజు.

బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ, “ఏ మాత్రం విశ్వసనీయత లేని మనిషి రేవంత్ రెడ్డి. జైలుకు వెళ్ళి వచ్చిన వ్యక్తి. చీప్ పబ్లిసిటీ కోసం అర్రులు చాచే వ్యక్తి అతను. అయినా అతను కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులుంటాడో అతనికే తెలియదు. అటువంటి వ్యక్తితో మేము చర్చలు జరపాలా?అసంభవం. నిజానికి కాంగ్రెస్ నేతలు చేసే నిరాధారమైన ఆరోపణలకు మేము సమాధానం చెప్పనవసరం లేదు. కానీ వారు మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు కనుక మా నిబద్దతను చాటుకోవడానికి మేము వాస్తవాలను తెలియజేసేందుకు సిద్దంగా ఉన్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా జానారెడ్డి వంటి విశ్వసనీయత ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరైనా వస్తే వారికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వివరాలు అన్నీ చూపించి, వారి సందేహాలు నివృతి చేయడానికి మేము సిద్దం. కాంగ్రెస్ నేతలకు మా ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం అలవాటుగా మారిపోయింది. వారు కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ ను’గోబెల్స్ భవన్’ గా మార్చేశారు,” అని అన్నారు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అస్త్రాలు సందించారు. అయన సోలార్ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, ధరల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు,” అని విమర్శించారు.


Related Post