రేపు ప్రగతి భవన్ కు వస్తాను: రేవంత్ రెడ్డి

January 11, 2018


img

ఒకవైపు తెలంగాణా ప్రభుత్వం రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేయడం గురించి గొప్పలు చెప్పుకొంటుంటే మరోపక్క కాంగ్రెస్ నేతలు దాని గాలితీసేసే విధంగా గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రెజంటేషన్లు ఇస్తూ, ఉచిత విద్యుత్ పై ప్రభుత్వానికి సవాళ్ళు విసురుతున్నారు.

తెరాస సర్కార్ ఇతర రాష్ట్రాలతో, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ సరఫరాకు చేసుకొన్న అనాలోచిత ఒప్పందాల వలన రాష్ట్ర ప్రభుత్వానికి రూ.957 కోట్లు నష్టం వచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత మూడున్నరేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఒప్పందాలు చేసుకొంది? రాష్ట్రానికి ఎంత విద్యుత్ సరఫరా అయ్యింది? దానికి ప్రభుత్వం ఎంత చెల్లించింది?మొదలైన వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ ఒప్పందాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి దాపరికం ఎందుకని ప్రశ్నించారు.

ఈ అంశంపై  విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్దమని, దీనిపై చర్చించడానికి రేపు (శుక్రవారం) తాను ప్రగతి భవన్ వస్తానని, దమ్ముంటే ఆయన కూడా రావాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. తెరాస నేతలు కూడా ఆయనను మంత్రిగా గుర్తించడం లేడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారాలలో కూడా బారీగా అవినీతి జరుగుతోందని, దానిని నిరూపించడానికి తాను సిద్దంగా ఉన్నానని రేవంత్ రెడ్డి తెరాస సర్కార్ కు సవాలు విసిరారు. మరి అయన సవాలును తెరాస సర్కార్ స్వీకరిస్తుందో లేదో చూడాలి.


Related Post