తెలంగాణలో ఎం‘సెట్’ చేశారు..?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై కోట్ల డీల్.. వేల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన వ్యవహారం. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఘరానా మోసం వెలుగులోకి రావడంతో ఇప్పుడు తెలంగాణలో ఎంసెట్ 2 పరీక్షపై అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. దాంతో సిఐడీ చేత విచారిస్తున్న ప్రభుత్వం మొత్తం పరీక్షనే రద్దుచేస్తున్నట్లు ప్రకటించడానికి సిద్ధమవుతోంది. కాగా దీనిపై కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే వాదన గట్టిగా వినిపిస్తుండటంతో ప్రభుత్వం డైలమాలో పడింది. 

ఏం జరిగింది..

ఎంసెట్ 2 పరీక్ష పత్రం లీకైంది. దాంతో టెన్త్ క్లాస్ లో ఫెయిల్, పాస్ మార్కులతో కాలం వెళ్లదీసిన వాళ్లకు కూడా వందల్లో ర్యాంకులు వచ్చాయి. వాళ్లే ఏపిలో ఎంసెట్ రాస్తే వేలల్లో ర్యాంకులు రావడం జరిగింది. ఖమ్మం, వరంగల్, విజయవాడ, నల్గొండ జిల్లాలకు చెందిన విద్యార్థుల ర్యాంకుల్లో భారీ అవకతవకలు జరిగాయి. 

ఇలా జరిగింది.. 

ఎంసెట్ 2 కోసం జెఎన్‌టియు అధికారులు నాలుగు సెట్ల ప్రశ్నపత్రాల ప్రింటింగ్ కు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలుసుకున్న రాజగోపాల్‌రెడ్డి అనే ఖిలాడీ, అన్ని పేపర్లను ప్రెస్ నుంచి బయటకు తెచ్చేలా అందులో పని చేస్తున్న ఒక ఉద్యోగితో బేరం కుదుర్చుకున్నాడు. అనుకున్నట్లుగానే ప్రెస్ ఉద్యోగి నాలుగు పేపర్లను జూన్ 18 న రాజగోపాల్‌రెడ్డికి అందించాడు. నాలుగు ప్రశ్నాపత్రాలు చేతిలోకి రాగానే వాటిని తనతో టచ్‌లో ఉన్న బ్రోకర్లు, కన్సల్టెంట్‌లకు చూపించి విద్యార్థులను తీసుకురావాలని కోరాడు. అప్పటికే దాదాపు 60 మంది విద్యార్థులతో  30 నుంచి 50 లక్షల వరకు బేరం కుదుర్చుకున్నారు బ్రోకర్లు, కన్సల్టెంట్‌లు. 

ఇలా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత విద్యార్థులలో కొంత మందిని ఎంసెట్ ఎంట్రన్స్‌కు వారం రోజుల ముందు నుంచే బెంగళూరు, ముంబైలకు తరలించి ప్రశ్నాపత్రాలను ఇచ్చి బట్టి పట్టించారు. ఏ ప్రశ్నాపత్రం వచ్చినా ఆ ప్రశ్నలకు చక చకా సమాధానాలు రాసేలా చదివించారు. ఎంట్రన్స్ పరీక్ష రోజున వారిని నేరుగా పరిక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. బ్రోకర్లు, కన్సల్టెంట్‌లు మొత్తం 8 మంది ఉంటారని, వీరంతా కలిసి దాదాపు రూ. 30 నుంచి 50 కోట్ల వరకు డీల్ చేసినట్లు అనుమానిస్తున్నామని దర్యాప్తు అధికారులు అంటున్నారు.

అదే గ్యాంగ్..

2014 పిజి మెడికల్ ఎంట్రన్స్ పేపర్‌ను గురివిరెడ్డి నేతృత్వంలో పలువురు ఒక గ్యాంగ్‌గా ఏర్పడి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన రాజగోపాల్ రెడ్డి మరోసారి తన టాలెంట్ ను చూపించారు. ఎంసెట్ 2016 ను జెఎన్‌టియు నిర్వహిస్తోందని తెలుసుకుని రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న వారితో పరిచయాలను పెంచుకున్నాడు. బెంగళూరులో ఉషా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్న రాజగోపాల్‌రెడ్డి తనను జెఎన్‌టియు సిబ్బంది నమ్మరన్న విషయాన్ని పసిగట్టి తప్పుడు పేరుతో వారితో సన్నిహితంగా ఉంటూ పేపర్‌ను ఎక్కడ ముద్రిస్తున్నారన్న విషయాన్ని రాబట్టాడు. ఢిల్లీలో పేపర్ ముద్రిస్తున్న విషయాన్ని తెలుసుకున్న రాజగోపాల్‌రెడ్డి వినుకొండ, వరంగల్, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలలోని పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో టచ్ లోకి వచ్చాడు. అదే విధంగా కన్సల్టెన్సీ, బ్రోకర్లకు కూడా పేపర్ లీక్ చేస్తామని, విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించాడు. దీంతో కొంత మంది బ్రోకర్లు, కన్సల్టెంట్‌లు రాజగోపాల్‌రెడ్డితో చేతులు కలిపారు.

ప్రభుత్వం ఏం చెయ్యబోతోంది..?

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎడ్యకేషన్ డిపార్ట్ మెంట్ లో జరిగిన అతి పెద్ద స్కాం ఎంసెట్ 2 పరీక్ష పత్రం లీక్. దీన్నికేసీఆర్ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. గతంలో చేసిన మాదిరిగానే ఓ గ్యాంగ్ పక్కా ప్లానింగ్ తో ఈ లీకేజ్ కు పాల్పడింది. 2016 ఎంసెట్ 2ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాగా ఇక్కడ ఇప్పటికే జులై నెల ముగియడంతో ఎంసెట్ ఎప్పుడు నిర్వహిస్తారు.. ఎప్పుడు రిజల్ట్ విడుదల చేస్తారు అనే ప్రశ్న తలుత్తుతోంది. దాంతో దీనిపై బాగా చర్చించిన తర్వాత టి సర్కార్ ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతోంది. ఇంటి దొంగల కారణంగా బయటపడ్డ ఈ స్కాంతో తెలంగాణ సర్కార్ పరీక్షల నిర్వహణలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం.