ప్రముఖ నిర్మాత కె రాఘవ మృతి

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె రాఘవ (105) ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లో అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. అయన 100సం.ల వయసు దాటిన తరువాత కూడా చాలా ఆరోగ్యంగా ఉంటూ వాకింగ్ కూడా చేస్తుండటం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు.   

భీష్మా, తాతామనవడు, సంసారం సాగరం, సుఖదుఃఖాలు, సంసారం, తూర్పు పడమర, జగత్ జంత్రీలు, జగత్ కిలాడీలు, సూర్యచంద్రులు, అంతులేని వింతకధ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చదువు సంస్కారం, మొదలైన అనేక సూపర్ హిట్ సినిమాలు తీశారు. అయన మొత్తం 30 చిత్రాలు నిర్మించగా వాటిలో 25 సినిమాలు అనేక సెంటర్లలో 100 రోజులు ఆడి సూపర్ హిట్ నిలిచాయి.

తెలుగు సినీపరిశ్రమ గర్వించదగ్గ ఆణిముత్యాలన దగ్గ అనేకమంది నటీనటులను, దర్శకులను ఆయనే పరిచయం చేశారు. వారిలో స్వర్గీయ దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణ, ఎస్పి బాల సుబ్రహ్మణ్యం, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, సుమన్ తదితరులున్నారు. 

అయన నిర్మించిన తాతామనవడు, సంసారం సాగరం చిత్రాలకు ఆయనకు నంది అవార్డులు లభించాయి. ఆ తరువాత ప్రతిష్టాత్మకమైన అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు అందుకొన్నారు.   

తెలుగు సినీపరిశ్రమలో పలువురు ప్రముఖులు అయనకు నివాళులు అర్పించారు. ఈరోజు మహాప్రస్థానంలో అయన అంత్యక్రియలు జరుగుతాయి.