ఆ జిల్లాకు టిబి నుంచి విముక్తి రాదా?

December 06, 2017
img

రాష్ట్రంలో నల్గొండవాసులు దశాబ్దాలుగా ఫ్లోరోసిస్ వ్యాధితో బాధలుపడుతుంటే, ఖమ్మం జిల్లాను టీబీ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఇక రాష్ట్రంలో అన్ని జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు చాలా మంది ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకొకటి చొప్పున రక్తం శుద్ధి చేసే డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా ప్రభుత్వ టిబి ఆసుపత్రి రికార్డుల ప్రకారం గత ఐదేళ్ళలో జిల్లాలో 10,876 మంది టిబి వ్యాధికి గురయ్యారు. అయితే వారిలో కేవలం 721 మంది మాత్రమే వ్యాధి నివారణకు చికిత్స తీసుకొన్నారు. గత ఐదేళ్ళలో ఈ వ్యాదినపడి 96 మంది మరణించినట్లు ఆసుపత్రి రికార్డులు తెలుపుతున్నాయి. 

జిల్లాలో టిబి వ్యాధి ఉదృతను దృష్టిలో పెట్టుకొని ఆర్.ఎన్.టి.సి.పి. పధకం క్రింద టిబి వ్యాధి నిర్ధారణ కోసం అవసరమైన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటి సహాయంతో కేవలం రెండు గంటలలోనే టిబి వ్యాధి ఉందో లేదో తెలుసుకోవచ్చు.   ఈ పధకంలో భాగంగా ఇంతవరకు 10 లక్షల మందికి టిబి చికిత్స అందించబడిందంటే జిల్లాలో ఆరోగ్య పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఖమ్మం తరువాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో కూడా ఇంచుమించు అదే స్థాయిలో టిబి వ్యాదిగ్రస్తులున్నట్లు తేలింది.  

ఈ పరిస్థితులను మార్చడానికి జిల్లా వైద్య,ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. జిల్లా వైద్యఆరోగ్యాధికారి డాక్టర్ కొండల రావు మీడియాతో మాట్లాడుతూ, “సాధారణంగా ఈవ్యాధి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకుతుంటుంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు తేలికగా సోకుతుంది. ఇది ఎక్కువగా ఊపిరితిత్తులకు సోకి ఆరోగ్యం దెబ్బ తీస్తుంటుంది. శరీరంలో ఇతర భాగాలకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది,” అని చెప్పారు. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపడుతున్న అనేక చర్యల వలన గత కొన్ని దశాబ్దాలలో జిల్లాలో టిబి వ్యాధి విజ్రుంభణను అరికట్టగలిగారు కానీ పూర్తిగా నివారించలేకపోతున్నారు. ఇది వ్యాధి సోకినవారి నుంచి గాలి ద్వారా ఇతరులకు వ్యాపించే ప్రమాదకరమైన అంటురోగం కావడం, దీనిపై ప్రజలలో సరైన అవగాహన లేకపోవడం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత లోపాల కారణంగా ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. దీర్గకాలంగా ఈ అంటువ్యాధి జిల్లాలో తిష్టవేసినందున, అది మందులకు కూడా లొంగని దశకు చేరుకొంటున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మహమ్మారి కారణంగా కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది కనుక ఆ ప్రభావం సమాజంపై కూడా పడుతోంది. ఈ మహమ్మారి నుంచి ఖమ్మం జిల్లాను విముక్తి ప్రసాదించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత గట్టిగా ప్రయత్నం చేయవలసి ఉంది.  

Related Post