నల్లగొండ శిశుగృహలో ఆగని పసిపిల్లల మరణాలు

December 01, 2017
img

నల్లగొండ శిశుగృహలో పసిపిల్లలు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు నెలలో ఆరుగురు పసిపిల్లలు వివిధ ఆరోగ్యసమస్యలతో మరణించారు. శిశుగృహకు చెందిన స్నేహలత అనే మరో చిన్నారి హైదరాబాద్ రెయిన్ బొ ఆసుపత్రిలో నిన్న మృతి చెందింది. 

ఆమెకు న్యుమోనియా జ్వరం రావడంతో శిశుగృహ అధికారులు ఆమెను హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ ఆమె ఎంతకూ కోలుకోకపోవడంతో ఆమెను హైదరాబాద్ లోని రెయిన్ బో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించిన రెయిన్ బో ఆసుపత్రి వైద్యులు అందుకు తగిన వైద్యం అందించినప్పటికీ ఆ చిన్నారి ప్రాణాలు నిలుపలేకపోయారు.  

శిశుగృహలో పసిపిల్లల మరణాలపై మీడియాలో వార్తలు వస్తుండటంతో కొన్ని రోజుల క్రితమే డి.ఆర్.ఓ. ఖిమ్యా నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి, ఐసిడిఎస్ అధికారులు శిశుగృహకు వెళ్ళి విచారణ జరిపారు. శిశుగృహలో పసిపిల్లలకు సరైన పోషకాహారం లభించకపోవడంతో వారిలో రోగనిరోధక శక్తి తగ్గి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా తట్టుకోలేక మరణిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తల్లులులేని ఆ పసిపిల్లలకు పాలపొడితో చేసిన పాలను అందిస్తున్నందున కొంతమంది పిల్లలకు అజీర్తి చేస్తోందని వార్తలు వచ్చాయి. ఈ సమస్యపై కూడా అధికారులు దర్యాప్తు చేశారు. ఆ తరువాత శిశుగృహలో పరిస్థితులలో ఏమైనా మార్పులు వస్తాయని ఆశిస్తే మళ్ళీ నిన్న మరో పసిపాప చనిపోవడం బాధాకరం. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ బుధవారం హైదరాబాద్ వెళ్ళి ఆసుపత్రిలో పాప ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. అంతలోనే ఆమె మృతి చెందడంతో ఆయనకు కూడా షాక్ కు గురయ్యారు. 

రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో గల శిశుగృహాల్లో పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు ఒక్క నల్లగొండ శిశుగృహలోనే వరుసగా పసిపిల్లలు ఎందుకు మరణిస్తున్నారో ఎవరూ కనుగొనలేకపోవడం విస్మయం కలిగిస్తోంది.   

Related Post