వనపర్తి, గద్వాలలో డయాలసిస్ సెంటర్లు ప్రారంభం

November 20, 2017
img

రాష్ట్రంలో నానాటికీ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధి కారణంగా రెండు కిడ్నీలు పాడైనవారు తప్పని సరిగా ప్రతీ రెండు-మూడు వారాలకు ఒకసారి రక్తం శుద్ధి (డయాలసిస్) చేయించుకోకతప్పదు. లేకుంటే ప్రాణాలు నిలువవు. కానీ ఒక్కసారి రక్తం శుద్ధి చేయించుకోవాలంటే ప్రైవేట్ ఆసుపత్రులలో కనీసం రూ.5-13,000 వరకు వసూలు చేస్తున్నాయి. అయితే రాష్ట్రంలో చాలా మంది పేదల నెలసరి ఆదాయం రూ.1,000 కూడా ఉండదు. ఇక రూ.5-13,000 ఖర్చు చేసి ఏవిధంగా రక్తం శుద్ధి చేసుకోగలరు? అలా చేసుకోలేని నిసహాయులు మెల్లమెల్లగా మరణానికి చేరువవుతున్నారు. 

ఈ సమస్య తీవ్రతను గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం రాజధాని హైదరాబాద్ తో సహా అన్ని జిల్లా కేంద్రాలలో గల ప్రభుత్వాసుపత్రులలో మొత్తం 40 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. వాటిలో కిడ్నీ రోగులకు పూర్తి ఉచితంగా రక్తం శుద్ధి చేస్తారు. 

ఇప్పటికే హైదరాబాద్ లో మలక్ పేట, వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రులలో డయాలసిస్ సెంటర్లు పనిచేస్తున్నాయి. అవి కాక సంగారెడ్డి, సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లా కేంద్రాలలో ఏర్పాటుచేసినవి కూడా పనిచేస్తున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈరోజు వనపర్తి, గద్వాలలో రెండు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 5 పడకలు ఏర్పాటు చేశారు. 

ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా 40 కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని భావించినప్పటికీ, డయాలసిస్ యంత్రాల కొనుగోలు, ఆసుపత్రులలో వాటి ఏర్పాట్లలో ఆలస్యం అయినందున ఇంతవరకు అన్ని కేంద్రాలు సిద్దం కాలేదు. మరొక 3-4 నెలలలో మొత్తం 40 డయాలసిస్ కేంద్రాలు సిద్దం అయ్యే అవకాశాలున్నాయి. అవన్నీ అందుబాటులోకి వస్తే, నిరుపేద కిడ్నీ రోగులకు చాలా ఉపశమనం కలుగుతుంది. 

Related Post