భారత్ కే మిస్ వరల్డ్ కిరీటం

November 18, 2017
img

ఈరోజు చైనాలో సాన్యా సిటీలో జరిగిన మిస్ వరల్డ్-2017 అందాల పోటీలలో మిస్ ఇండియా మానుషీ చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకొంది. ఈ పోటీలో వివిధ దేశాలకు చెందిన 118 మంది అందాలభామలు పాల్గొనగా భారత్ కు చెందిన మానుషీ చిల్లర్ విజేతగా నిలిచింది. ఆమె తరువాత స్థానాలలో మెక్సికోకు చెందిన ఆండ్రియా మేజ్, ఇంగ్లాండ్ కు చెందిన స్టీఫెన్ హిల్ నిలిచారు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా 2000 సం.లో జరిగిన పోటీలలో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకొంది. మానూషి చిల్లర్ ను విజేతగా ప్రకటించగానే 2016లో మిస్ వరల్డ్ విజేత స్టెఫానీ డేల్ వాల్లే తన కిరీటాన్ని ఆమెకు ధరింపజేసింది. 

ఈ సందర్భంగా మానుషీ చిల్లర్ మీడియాతో మాట్లాడుతూ, “నా చిన్నతనం నుంచి అందాలపోటీలంటే చాలా ఇష్టపడేదాన్ని. తరచూ స్కూల్, కాలేజీ లెవెల్ పోటీలలో పాల్గొనేదాన్ని. వయసు పెరుగుతున్న కొద్దీ మిస్ వరల్డ్ పోటీలలో నెగ్గడం చాలా గొప్ప విషయమని తెలుసుకొని అదే లక్ష్యంగా పెట్టుకొని కృషి చేశాను. చివరికి నా లక్ష్యాన్ని సాధించగలిగాను. నా లక్ష్య సాధనలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ నాకు చాలా సహాయసహకారాలు అందించారు..వెన్నంటి ఉండి చాలా ప్రోత్సహించారు. కనుక ఇది మా అందరికీ కూడా ఒక మరపురాని మధురానుభూతిగా నిలిచిపోతుందని చెప్పగలను. ఇక్కడితో నా ప్రయాణం అయిపోయిందని నేను భావించడం లేదు. ఇక ముందు కూడా నిరంతరంగా కృషి చేయాలనుకొంటున్నాను,” అని మానుషీ చిల్లర్ అన్నారు.             

హర్యానా రాష్ట్రానికి చెందిన మానుషీ చిల్లర్ 1997, మే14వ తేదీన జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్ మిత్ర బసు చిల్లర్ రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి విభాగంలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆమె తల్లి డాక్టర్ నీలం ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ మరియు అలైడ్ సైన్సస్ సంస్థలో న్యూరోకెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నారు. మానుషీ చిల్లర్ కూడా సోనిపట్ లోని మెడికల్ కళాశాలలో వైద్యవిద్యలో (ఎంబిబిఎస్) డిగ్రీ చేశారు. వృత్తిరీత్యా వైద్యురాలు అయినప్పటికీ ఆమె రాజా, రాధారెడ్డి వద్ద శిష్యరికం చేసి కూచిపూడి నృత్యం అభ్యసించారు. కేవలం 20 ఏళ్ళ వయసుకే ఇంత గొప్పపేరు సంపాదించడం కూడా చాలా గొప్ప విషయమే! 

Related Post