నేడు డిల్లీ..రేపు..?

November 10, 2017
img

మన దేశంలో జల, వాయు, శబ్ద కాలుష్యాలను నియంత్రించేందుకు కటినమైన చట్టాలు, వాటిని అమలుచేసేందుకు  ప్రభుత్వంలో అనేక వ్యవస్థలు ఉన్నప్పటికీ నానాటికీ ఈ మూడు రకాల కాలుష్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం ప్రభుత్వాలు, ప్రభుత్వంలో వ్యవస్థలు, ప్రజలు అందరూ కూడా వాటిని చాలా ‘లైట్’ తీసుకోవడమేనని చెప్పక తప్పదు. అందుకే చేతులు కాలేవరకు ఎవరూ మేల్కొనరు. ఒకవేళ ఎవరైనా మేల్కొలపాలని ప్రయత్నించినా, వాళ్ళను పిచ్చివాళ్ళను చూసినట్లు చూసి అందరూ నవ్వుకొంటారు. అందరిలో నెలకొన్న ఈ అశ్రద్ధ, అవగాహనాలోపం కారణంగానే నేడు డిల్లీలో వాయు కాలుష్యం ఆవరించింది. 

సాధారణంగా శీతాకాలంలో వాతావరణంలో సాంద్రత పెరగడం వలన అత్యంత ప్రమాదకరమైన విషవాయులు పైకి ఆకాశంలోకి వెళ్ళలేక పొగమంచుతో కలిసి క్రిందనే ఉండిపోతాయి. ప్రస్తుతం డిల్లీలో అదే జరుగుతోంది. డిల్లీ అంతటా దట్టమైన పొగమంచు..దానిలో ప్రమాదకరమైన విషవాయువులు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

గత ఏడాది కూడా ఇటువంటి సమస్యే ఎదురైనప్పుడు, వాయుకాలుష్యం తగ్గించడానికి డిల్లీ సర్కార్ సరిబేసి పద్దతిని అమలు చేసి రోడ్లపైకి అన్ని వాహనాలు రాకుండా నియంత్రించింది. కానీ ఆ ఆ తరువాత వాతావరణం మారడంతో ఆ సమస్య గురించి మరిచిపోయింది. ఈ ఏడాది మళ్ళీ శీతాకాలం రావడంతో ఆ సమస్య మళ్ళీ పునరావృతం అయ్యింది. కాకపోతే ఈసారి మరింత తీవ్రస్థాయిలో కంటికి కనబడే స్థాయికి చేరుకొంది. కనుక మళ్ళీ డిల్లీ ప్రభుత్వం మేల్కొని హడావుడిగా సరిబేసి వాహనాల విధానాన్ని అమలుచేయడం మొదలుపెట్టింది. 

అయితే డిల్లీలో లేదా మరే ప్రాంతంలోనైనా జల,వాయు కాలుష్యానికి ప్రధానకారణం కాలుష్యం వెదజిమ్మే కొన్ని రకాల పరిశ్రమలేనని అందరికీ తెలుసు. కానీ వాటిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే, రాజకీయ ఒత్తిళ్ళు, పైరవీలు మొదలైపోతాయి. కాలికి గాయం అయితే చేతికి మందు పూసుకోవడం వలన ఉపయోగం ఉండనట్లే, సరిబేసి విధానంతో 10-15 రోజులు వాహనాలను నియంత్రించడం వలన ఈ పెనుసమస్య పరిష్కారం కాదని అందరికీ తెలుసు. ఇది ఇప్పటికే ఒకసారి నిరూపించబడింది మళ్ళీ వచ్చే ఏడాది కూడా మరోసారి తప్పక నిరూపించబడుతుంది. 

ఈ వాయు కాలుష్య సమస్య డిల్లీకి సంబందించిన సమస్య.. దానితో మనకు సంబంధం లేదని ఇతర రాష్ట్రాలు, ప్రభుత్వాలు అనుకొంటే అది అవివేకమే అవుతుంది. డిల్లీలో ఏర్పడిన ఈ సమస్యను తొలి హెచ్చరికగా స్వీకరించి అన్ని రాష్ట్రాలు, ప్రభుత్వాలు, వ్యవస్థలు, ప్రజలు ఈ కాలుష్య నియంత్రణకు ఇప్పటి నుంచే గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. లేకుంటే నేడు డిల్లీ..రేపు హైదరాబాద్..ఎల్లుండి విజయవాడ..కాస్త ముందు వెనుకా అంతే. 

Related Post