అవిభక్త కవలలను విడదీశారు..గ్రేట్!

October 28, 2017
img

దేశంలో మొట్టమొదటిసారిగా అవిభక్త కవలలను డిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా విడదీశారు. 

ఓడిశాలోని కంధమాల్ జిల్లాకు చెందిన జగ్గన్నాద్, బలరాం అనే రెండేళ్ళ ఐదు నెలల వయసున్న ఇద్దరు పిల్లలు, హైదరాబాద్ లోని మన వీణావాణీలలాగే తలలు అతుక్కుపోయి పుట్టారు. 20 మంది ఎయిమ్స్ వైద్య నిపుణులు ఏకధాటిగా 20 గంటల పాటు శస్త్రచికిత్స చేసి వారిరువురినీ విడదీశారు. ఈ ఆపరేషన్ తరువాత వారిద్దరి పరిస్థితి మొదట విషమించినప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఇద్దరూ కోలుకొంటున్నారు. 

కానీ వారిలో జగన్నాథ్ కు గుండె సంబంధిత సమస్యలు, బలరాం కు కిడ్నీ సంబంధిత సమస్యలున్నాయని కనుక వారిరువురికీ మరొక వారం రోజులు చాలా క్లిష్టమైన సమయమేనని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. వారికి అవసరమైన అన్ని రకాల చికిత్సలు చేస్తున్నామని, వారు పూర్తిగా కోలుకొంటే ముఖ్యమైన కొన్ని అవయవాలను సరిచేయడానికి మరొకసారి ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. 

వారికి రెండు దశలలో రెండుసార్లు మేజర్ ఆపరేషన్స్ జరిగాయి. మొదటిసారి ఆగస్ట్ 28న సుమారు 20 గంటలు, మళ్ళీ అక్టోబర్ 25వ తేదీన 20 గంటలు పాటు కీలకమైన మరో ఆపరేషన్ చేసి ఇద్దరినీ విడదీశామని డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. 

ఈ మారధాన్ ఆపరేషన్ లో కీలక పాత్ర వహించిన మరొక వైద్యుడు చాలా ఆసక్తికరమైన విషయం చెప్పారు. తాము ఈ ఆపరేషన్ చేయడానికి ముందు ‘3డి మోడల్ డమ్మీ పేషంట్’ పై అనేకసార్లు ఆపరేషన్ ప్రాక్టీస్ చేసి, దానిలో ఎదురైనా సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలో అర్ధం చేసుకొన్నాక ఈ ఆపరేషన్ చేశామని తెలిపారు. తాము చేసిన ఆ ముందస్తు కసరత్తు కారణంగానే సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ ను ఎటువంటి తడబాటు లేకుండా విజయవంతంగా చేయగలిగామని తెలిపారు. 

సాధారణంగా ఇటువంటి అవిభక్త కవలల ఆపరేషన్ తరువాత పిల్లలు ఇద్దరూ లేదా ఒకరైనా బ్రతికే అవకాశాలు 50 శాతం మాత్రమే ఉంటాయని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో ఇద్దరు పిల్లలు కోలుకోవడం అదృష్టమే. భారతీయ వైద్యుల ప్రతిభకు ఇదొక అపూర్వమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీరిరువురి ఆపరేషన్ విజయవంతం అయ్యింది కనుక హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రినే తమ ఇల్లుగా చేసుకొని భారంగా బ్రతుకుతున్న వీణావాణీ (13)లకు కూడా  ఆపరేషన్ చేసి విడదీసే ఆలోచన చేస్తారేమో?

              

Related Post