చేవెళ్ళ అందుకు వేదిక కాబోతోంది..గ్రేట్!

October 13, 2017
img

ప్రభుత్వాసుపత్రులు..ప్రైవేట్ ఆసుపత్రులు..సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల గురించి వాటి తీరుతెన్నుల గురించి అందరికీ తెలుసు కానీ ‘పాలియేటివ్ కేర్ ఆసుపత్రుల’ గురించి బహుశః చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే అటువంటి విభాగం ఉన్న ఆసుపత్రి మన రాష్ట్రంలో ఒక్కటే ఉంది. అది హైదరాబాద్ లో గల ఎం.ఎన్.జె. క్యాన్సర్ ఆసుపత్రిలో మాత్రమే ఉంది. 

దాని ప్రత్యేకత ఏమిటంటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాల బారినపడి రోజులు లెక్కపెట్టుకొంటూ నరకయాతన అనుభవించే రోగులకు అక్కడ ఉపశమనం కలిగించే వైద్యం అందిస్తారు. అక్కడ ఆ రోగాలను తగ్గించేందుకు ఎటువంటి చికిత్స చేయరు. ఆ నొప్పి, బాధను తగ్గించి చివరి రోజుల్లో ప్రశాంతంగా మరణించడానికి అవసరమైన మార్పిన్ వంటి మందులు మాత్రమే ఇస్తారు. రోగికి పూర్తి ఉపశమనం కలిగించడానికి ఏమేమి చేయాలో అవి మాత్రమే చేస్తుంటారు. అవసరమైతే ఆ రోగులతో మానసికవైద్య నిపుణులు, ఈ రంగంలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులు, వైద్యులు, ఆత్మీయుల చేత మాట్లాడిస్తూ స్వాంతన కల్పిస్తుంటారు. కనుక ఇటువంటి సేవలు అందించే పాలియేటివ్ కేర్ ఆసుపత్రి జీవితం అవసాన దశలో ఉన్నరోగులకు గొప్ప వరం వంటిదేనని చెప్పవచ్చు. 

అటువంటి పాలియేటివ్ కేర్ ఆసుపత్రిని చేవెళ్ళ ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించబోతున్నారు. ఈ విభాగంలో ఆరు పడకలు ఉంటాయి. ఒక వైద్యుడితో సహా మొత్తం 16 మంది సిబ్బంది ఉంటారు. దీనికోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఇతర ప్రాంతంలో ఏర్పాటవుతున్న మొట్టమొదటి పాలియేటివ్ కేర్ ఆసుపత్రి ఇదే. 

Related Post