శనివారం నుండి దేశవ్యాప్తంగా కరోనా టీకాలు

January 15, 2021
img

శనివారం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఆన్‌లైన్‌లో దీనిని ప్రారంభిస్తారు. 

ఇప్పటికే కోవీషీల్డ్, కోవాక్సిన్‌ టీకాలు అన్ని రాష్ట్రాలలో జిల్లాలకు చేరుకున్నాయి. దీని కోసం దేశవ్యాప్తంగా 3,006 టీకా కేంద్రాలను ఏర్పాటుచేశారు. వాటిలో రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేస్తారు. తొలిరోజున ఒక్కో కేంద్రంలో 100 మందికి చొప్పున టీకాలు వేస్తారు. 

దేశంలో 135 కోట్లకు పైగా ఉన్న జనాభాకు టీకాలు వేసేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఖచ్చితమైన ప్రణాళిక, ఏర్పాట్లతో ముందుకు సాగుతున్నాయి. కరోనా టీకాలు వేసే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఏవైనా సమస్యలు, లోటుపాట్లు గుర్తించి, ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వారు ఆన్‌లైన్‌లో దేశవ్యాప్తంగా కొనసాగబోయే టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంటారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేస్తోంది.       

కేంద్రప్రభుత్వం కోవిన్ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. టీకాలు వేసుకొదలచినవారు దానిలో తమ వివరాలను నమోదుచేసుకొని, సూచించిన సమయం ప్రకారం టీకా కేంద్రాలకు వెళ్ళి టీకాలు వేయించుకోవచ్చు. తొలిదశలో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, హెల్త్ వర్కర్లు, ఐసీడీఎస్ సిబ్బందికి మాత్రమే టీకాలు వేస్తారు.


Related Post