కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తికి పోటీపడుతున్న భారతీయ కంపెనీలు

November 28, 2020
img

ఈ ఏడాది యావత్ ప్రపంచ దేశాలను స్తంభింపజేసి, లక్షలాదిమందిని బలితీసుకొన్న కరోనా మహమ్మారిని అంతుచూసేందుకు భారత్‌తో సహా అనేకదేశాలలో వ్యాక్సిన్‌ తయారుచేస్తున్నాయి. భారత్‌లో హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్ కంపెనీ కోవాక్సిన్ దేశీయంగా తయారుచేస్తుండగా, పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా యూరోపియన్ కంపెనీ ఆస్ట్రాజెనికా తయారుచేసిన కొవీషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేసుకొంటోంది. అహ్మదాబాద్‌లోని కాడిలా హెల్త్ కేర్ కంపెనీ కూడా జైకోవ్-డి పేరుతో తయారుచేసిన వ్యాక్సిన్‌కు క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. త్వరలోనే దానిపనితీరు కూడా తెలుస్తుంది.

ఇప్పటికే రష్యాలో అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్-వి’ని భారత్‌లో కూడా భారీగా ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన హెటెరో డ్రగ్స్ కంపెనీ సన్నాహాలు చేసుకొంటోంది. దానిని తయారుచేసేందుకు రష్యన్ డైరెక్ట్    ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకొంది.

ఇతర దేశాలలో ఆ వ్యాక్సిన్‌ 91.4 శాతం సామర్ధ్యంతో చాలా ప్రభావంతంగా పనిచేస్తున్నప్పటికీ దానిని భారత్‌లో వినియోగించాలంటే మళ్ళీ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించి సంతృప్తికరమైన ఫలితాలు ఇస్తున్నట్లు నిర్ధారించుకోవలసి ఉంటుంది. ఆ తరువాతే ఉత్పత్తి ప్రారంభించవలసి ఉంటుంది. కనుక భారత్‌లో ప్రముఖ ఫార్మాకంపెనీ డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ సంస్థ ఆ బాధ్యతలు స్వీకరించి క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోగా 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ పూర్తికావచ్చని ఆ సంస్థ భావిస్తోంది. కనుక ఆలోగా ‘స్పుత్నిక్-వి’ ఉత్పత్తికి హెటెరో డ్రగ్స్ అవసరమైన ఏర్పాట్లు చేసుకొంటోంది.

హైదరాబాద్‌లోగల బయోఫార్మాస్యుటికల్స్ సంస్థతో ఏడాదికి 10 కోట్లు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం చేసుకొంది. మార్చిలో క్లినికల్ ట్రయల్స్‌ ముగియగానే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి అనుమతులు పొంది వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తోంది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ ఒక్కో డోసు భారత్‌లో సుమారు రూ.740లు ఉండవచ్చని హెటెరో డ్రగ్స్ సంస్థ తెలిపింది.

Related Post