కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం

November 24, 2020
img

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలు విముక్తి పొందే సమయం ఆసన్నమైంది. ఫిభ్రవారి నెలాఖరులోగా మార్చి మొదటివారంలో ఎప్పుడైనా భారత్‌లో కూడా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. కానీ 135 కోట్లకు పైగా దేశజనాభాకు కరోనా టీకాలు(వ్యాక్సినేషన్) వేయించడానికి చాలా భారీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా, ఎటువంటి చిన్న పొరపాట్లు జరిగినా తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ్ళ మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో సమావేశమయ్యి ఈ అంశంపై చాలా లోతుగా చర్చించారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీకి దీనిపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వాతావరణ పరిస్థితి నెలకొని ఉంటుంది కనుక శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ను ముందుగా ప్రతీ రాష్ట్రంలో పరిమిత సంఖ్యలో కొంతమందికి ఇచ్చి ఎటువంటి దుష్ప్రభావాలు కనబడకపోతే అప్పుడు అందరికీ ఇస్తే మంచిదని సూచించారు.  

ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్రప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముందుగా కరోనాతో పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, ఆ తరువాత వరుసగా పోలీసులు, పారిశుద్య కార్మికులు, రక్షణరంగ సిబ్బందికి, 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు, డయాబెటీస్ వంటి దీర్గకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ ప్రకారమే కరోనా వ్యాక్సినేషన్ చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఎం కేసీఆర్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. 

ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేవరకు కూడా దానిని నిర్ధిష్ట ఉష్ణోగ్రతలోనే భద్రపరచవలసి ఉంటుంది లేకుంటే వికటించే ప్రమాదం ఉంది. కనుక రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల, గ్రామస్థాయి వరకు ఓ ‘కోల్డ్ చెయిన్’ (శీతలీకరణ వ్యవస్థ) ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Related Post