కరోనా రెండోదశను ఎదుర్కొనేందుకు సిద్దం: కేసీఆర్‌

November 23, 2020
img

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత, కేసులు, మరణాలు బాగా తగ్గి చాలా మంది కోలుకొంటున్నప్పటికీ, దేశరాజధాని న్యూఢిల్లీ, మహారాష్ట్రలో మళ్ళీ భారీగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈనెల 11వ తేదీన న్యూఢిల్లీలో కొత్తగా 8,539 కేసులు నమోదయ్యాయి. గత వారం పది రోజులుగా ఢిల్లీలో రోజుకు సుమారు 100 మంది కరోనాతో మరణిస్తున్నారు. ఢిల్లీలో ఇప్పటికే రెండోదశ (సెకండ్ వేవ్) దాటి మూడో దశ మొదలైందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ స్వయంగా ప్రకటించారు. కరోనా తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం మళ్ళీ ఆంక్షలు అమలుచేయడం మొదలుపెట్టింది. త్వరలోనే మళ్ళీ లాక్‌డౌన్‌ విధించేందుకు కూడా సిద్దమవుతోంది. మహారాష్ట్రలో ముంబైతో సహా కొన్ని జిల్లాలలో మళ్ళీ కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతుండటంతో మహారాష్ట్రలో కూడా మళ్ళీ లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో ఉంది. 

ఈ నేపధ్యంలో తెలంగాణలో కూడా మళ్ళీ  కరోనా రెండో దశ ప్రారంభం అయ్యే ప్రమాదం పొంచి ఉందని సిఎం కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో నిన్న వైద్యఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్రంలో ఇపుడిపుడే మళ్ళీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయని, మళ్ళీ కరోనా తీవ్రత పెరిగితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది కనుక కరోనా కేసులు మరింత పెరగకుండా అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ రాష్ట్రంలో కరోనా రెండోదశ మొదలైతే దానినీ సమర్ధంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు కనుక అది వచ్చే వరకు ప్రజలందరూ కూడా అన్ని జాగ్రత్తలు పాటించాలని సిఎం కేసీఆర్‌ కోరారు. రాష్ట్రంలో వైద్యులు, నర్సులు, సిబ్బంది, అధికారులు అందరూ చాలా బాగా పనిచేసి ఇంతవరకు కరోనాను సమర్ధంగా నియంత్రించగలిగారని సిఎం కేసీఆర్‌ ప్రశంసించారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే మొట్టమొదట కరోనా వారియర్స్ (కరోనా ఆసుపత్రులలో పనిచేసే వైద్యులు, నర్సులు, సిబ్బంది)కి ఇస్తామని అన్నారు.

Related Post