ఆసుపత్రుల ముందు డ్యాష్ బోర్డ్స్...మంచి ఆలోచనే

July 08, 2020
img

రాష్ట్రంలో కరోనా సోకిన రోగులు వైద్యం కోసం ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసివస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రులలో చాలా బెడ్లు ఖాళీగా ఉన్నప్పటికీ కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవాళ్ళను మాత్రమే చేర్చుకొంటున్నాయి. కనుక వారు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తే వారి నుంచి భారీగా భారీగా డబ్బు పిండుకొని బెడ్లు కేటాయిస్తున్నాయి. అంత మొత్తం చెల్లించలేనివారికి ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ లేవని చెప్పి చేర్చుకోకుండా వెనక్కు తిప్పి పంపించేస్తున్నాయి. 

కరోనా సోకిన రోగులు ఆసుపత్రిలో చేరేందుకు ఈవిధంగా ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తిరగవలసిరావడం చాలా బాధాకరమే కాక ఆ వ్యక్తి ఏదో ఓ ఆసుపత్రిలో చేరేలోగా వైరల్ లోడ్ పెరిగిపోయి మరణించే ప్రమాదం ఉంటుంది. కరోనా రోగి ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తిరుగుతున్నప్పుడు ఆ వ్యక్తిద్వారా ఇతరులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. హైకోర్టు న్యాయవాది శివగణేష్ ఈ సమస్యను హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. 

ఆయన దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా చికిత్స అందిస్తున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ముందు ఆసుపత్రిలో ఎన్ని బెడ్లు, వెంటిలేటర్లు ఖాళీ ఉన్నాయనే విషయం తెలియజేస్తూ ఆసుపత్రుల ముందు అందరికీ కనబడేలా ఒక డిజిటల్ డిస్‌ప్లే బోర్డు వంటిది ఏర్పాటు చేయాలని ఆసుపత్రులను ఆదేశించవలసిందిగా న్యాయవాది శివగణేష్ హైకోర్టును అభ్యర్ధించారు. ఆవిధంగా చేస్తే కరోనా రోగులు ఆసుపత్రుల ముందు పడిగాపులు కాయవలసిన అవసరం ఉందని వాదించారు. 

న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి , స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఫర్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదావేసింది.

Related Post