కరోనా వాక్సిన్ హైదరాబాద్‌లోనే తయారీ

June 30, 2020
img

దేశానికి కరోనా వాక్సిన్ హైదరాబాద్‌ అందించబోతోంది. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేస్తున్న కరోనా వాక్సిన్ మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌కు భారత ఔషద నియంత్రణ మండలి (డిసిజిఐ) అనుమతి మంజూరు చేసింది. ఈ విషయం భారత్‌ బయోటెక్ కంపెనీ ఛైర్మన్ మరియు ఎండీ డాక్టర్ కృష్ణ స్వయంగా తెలియజేశారు. ఐసీఎంఆర్ మరియు పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీల సహకారంతో కరోనా సోకకుండా కాపాడేందుకు ‘కొవాగ్జిన్’ అనే వాక్సిన్ తయారుచేసినట్లు డాక్టర్ కృష్ణ తెలిపారు. దాని పరీక్షలకు అనుమతి లభించినందున, త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా దీనిని దేశప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని తమ కంపెనీలో ‘బయో సేఫ్టీ లెవెల్-3’ ప్రమాణాలు కలిగిన అత్యంత సురక్షితమైన ప్రయోగశాలలో ఈ టీకాను తయారుచేశామని చెప్పారు. 

‘వీరో సెల్ కల్చర్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ’ ద్వారా జపనీస్ ఎన్‌సెఫలైటీస్, చికున్‌గున్యా, జీకా, పోలియో, రేబిస్ వ్యాధులకు టీకాలను భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు టీకాను తయారుచేసి అందించబోతోంది. మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ పూర్తయ్యేందుకు సుమారు మూడు నాలుగు నెలలు సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఒకవేళ వాటిలో సత్ఫలితాలు వచ్చినట్లయితే ఈ ఏడాది డిసెంబరులోగా భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు. భారత్‌ను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి భారత్‌ బయోటెక్ విముక్తి కల్పిస్తుందని ఆశిద్దాం.

Related Post