ఇపుడు కరోనా భయాలు లేవు: మంత్రి ఈటల

June 29, 2020
img

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఈరోజు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, "కరోనా మొదలైన కొత్తలో అది సోకితే చనిపోతామని ప్రజలు భయపడేవారు కానీ ఇప్పుడు అటువంటి భయాందోళనలు లేవు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన  తరువాత దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలలో కరోనా కేసులు పెరిగాయి. హైదరాబాద్‌లో కూడా అలాగే పెరిగాయి కానీ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. రాష్ట్రంలో ఒక్క గ్రేటర్ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి తప్ప జిల్లాలో అంతగా లేదు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధించాలనే ఆలోచనలో ఉన్నాము. మంత్రివర్గ సమావేశంలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకొంటాము. కరోనా మరణాల రేటు జాతీయస్థాయిలో 3 శాతం ఉండగా తెలంగాణలో 1.7 శాతం మాత్రమే ఉంది. 

కరోనా నివారణకు, చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటోంది. కరోనా కేసులు బయటపడినచోట కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించి, మిగిలిన ప్రాంతాలకు కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాము. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17,800 పడకలు సిద్దంగా ఉన్నాయి. వాటిలో 3,500 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉంది. త్వరలో మరో 6,500 పడకలకు కూడా ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తాము. 

రాష్ట్రంలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి ప్రతీరోజు 3-4,000 పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నాము. అవికాక అదనంగా మరో 50,000 పరీక్షలు చేస్తున్నాము. సాంకేతిక కారణాల వలన రెండు రోజులు కరోనా పరీక్షలు నిలిపివేశాము. రేపటి నుంచి మళ్ళీ యధావిధిగా పరీక్షలు నిర్వహిస్తాము. రేపటి నుంచి స్వాబ్ పరీక్షలు కూడా జరుపుతాము. 

కరోనా లక్షణాలున్నవారిని మాత్రమే ఆసుపత్రులలో చేర్చుకొని మిగిలినవారిని వారి ఇళ్ళలోనే ఉంచి చికిత్స అందిస్తున్నాము. వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్సలు చేస్తుంటే ఆసుపత్రులలో కరోనా రోగులను పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో  కొందరు దుష్ప్రచారం చేస్తుండటం చాలా శోచనీయం.

ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో హెడ్ నర్స్ కరోనా సోకి చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 240 మంది కరోనాతో మరణించారు. 184 మంది పోలీసులకు, 250 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. వారిలో చాలా మంది కోలుకొన్నారు," అని అన్నారు.  


Related Post