తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్

June 29, 2020
img

తెలంగాణలో కరోనా తీవ్రతను ఇతర రాష్ట్రాలతో పోల్చి తక్కువ చేసి చూపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ అధికార టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలే కరోనా నుంచి తప్పించుకోలేకపోవడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ ఆలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే ఈ వార్తను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించవలసి ఉంది. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బీగాల గణేశ్ గుప్తాలకు కరోనా సోకడంతో వారు ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అధికారిక పార్టీ నేతలు తరచూ అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవలసిరావడం వలన కరోనా బారిన పడుతుంటే, ప్రతిపక్షనేతలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే ప్రయత్నంలో రోడ్లపైకి వచ్చి కరోనాబారిన పడుతుండటం విశేషం. ఏది ఏమైనప్పటికీ, కరోనాకు రాజుపేద, కులమతాల పట్టింపు ఏమీ లేదని ఎవరికైనా సోకవచ్చని స్పష్టం అవుతోంది. కనుక ఆసుపత్రి పాలవకూడదనుకుంటే అందరూ తగిన జాగ్రత్తలు పాటించడమే మంచిది.       


Related Post