తెలంగాణలో మరో 127 మందికి పాజిటివ్

June 05, 2019
img

తెలంగాణలో రెండువారాల క్రితం రోజుకు 30-40 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతుండేవి. అవి కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉండేవి. కానీ మళ్ళీ ఇప్పుడు రోజుకు 100-150 కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.

గురువారం జీహెచ్‌ఎంసీలో 110, ఆదిలాబాద్‌లో 7, రంగారెడ్డిలో 6, మేడ్చల్‌లో 2, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలో చెరో పాజిటివ్ కేసులు కలిపి మొత్తం 127 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,699కి చేరింది. ఇవి కాక విదేశాల నుంచి తిరిగివచ్చినవారు, వలస కార్మికులలో 448 మంది కరోనాకు గురయ్యారు. వారితో కలిపితే రాష్ట్రంలో  3,147 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.  

రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 105కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,587 మంది కోలుకొని ఇళ్లకు తిరిగి వెళ్ళగా మరో 1,455 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.  


Related Post