తెలంగాణ జిల్లాలలో బయటపడుతున్న కరోనా కేసులు

May 30, 2020
img

తెలంగాణలో కరోనా మహమ్మారిని ప్రభుత్వం పూర్తిగా కట్టడిచేసినప్పటికీ లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడం, ప్రతీరోజు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వలస కార్మికులు తరలివస్తుండటం, ఇటీవల విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో తెలంగాణవాసులను వెనక్కురావడం వంటి కారణాలతో రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. సుమారు నెలరోజులుగా రాష్ట్రంలో 25 జిల్లాలలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు ఆ జిల్లాల సంఖ్య 17కి తగ్గిపోయింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 82, రంగారెడ్డిలో 14, సంగారెడ్డిలో 2, మెదక్ జిల్లాలో 2 కలిపి మొత్తం 100 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. 

ఇవికాక నిన్న ఒక్కరోజే విదేశాల నుంచి తీసుకువచ్చినవారిలో 64 మందికి, ఐదుగురు వలస కార్మికులకు కరోనా సోకినట్లు తెలిపింది. అంటే నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 169 కొత్త కేసులు నమోదయ్యాయన్న మాట! 

రాష్ట్రంలో ఇప్పటి వరకు 180 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి తీసుకురాబడిన 237 మంది కలిపి మొత్తం 417మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో 2,008 కేసులు, ఇతర కేసులు 417 కలిపి మొత్తం 2,425 కరోనా కేసులయ్యాయి.  

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,381 మంది కరోనా నుంచి కోలుకోగా మరో 973 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 71 మంది కరోనాకు బలయ్యారు. 

రాష్ట్రంలో వరంగల్‌ రూరల్, యాదాద్రి, వనపర్తి మూడు జిల్లాలలో గత రెండు నెలల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

గత 14 రోజులలో 17 జిల్లాలలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు. అవి: రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్‌, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ అర్బన్, గద్వాల్, జనగావ్, నిర్మల్ జిల్లాలు.

Related Post